పార్సిల్ భోజనంలో పచ్చడి మిస్.. రూ.35వేలు ఫైన్ వేసిన కోర్టు

ఇంతకూ పచ్చడి ఇవ్వని హోటల్ కు వినియోగదారుల కోర్టు విధించిన భారీ ఫైన్ వెనుక బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే..

Update: 2024-07-26 07:30 GMT

అవును.. మీరు చదివింది కరెక్టే. భోజనాన్ని పార్సిల్ తీసుకున్న వేళ.. అందులో ఊరగాయ (పచ్చడి) ఇవ్వని హోటల్ కు భారీగా ఫైన్ వేసిన ఉదంతం తమిళనాడులో చోటు చేసుకుంది. సాధారణంగా మీల్స్ తో పాటు.. పచ్చడి ఇస్తుంటారు.కానీ.. తాజా ఉదంతాన్ని చూస్తే.. భోజనం పార్సిల్ లో పచ్చడి మిస్ కావటం ఇంత పెద్ద నేరమా? అన్న భావన కలగటం ఖాయం. ఇంతకూ పచ్చడి ఇవ్వని హోటల్ కు వినియోగదారుల కోర్టు విధించిన భారీ ఫైన్ వెనుక బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే..

తమిళనాడులోని విల్లుపురానికి చెందిన ఆరోగ్య స్వామి అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక ఫేమస్ హోటల్ కు వెళ్లాడు. ఒక ఆశ్రమానికి ఆయన భోజనాల్ని తీసుకెళ్లాలని భావించారు. ఇందులో భాగంగా పాతికే మీల్స్ ను ఆర్డర్ ఇచ్చారు. హోటల్ వారు చెప్పినంత డబ్బులు చెల్లించాడు. అయితే.. భోజనం పార్సిల్ లో పచ్చడి ఇవ్వలేదు. ఇదే విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికితీసుకెళ్లారు. అయితే.. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

దీంతో సదరు ఆరోగ్య స్వామి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇరు వర్గాల వాదల్ని విన్నది. ఆధారాల్ని పరిశీలించింది. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించిన వినియోగదారుల ఫోరం.. ఆరోగ్య స్వామి వాదనకు ఏకీభవించింది. ఆయనకు రూ.35 వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News