ట్రాప్ లతో అదరగొట్టేస్తున్న తెలంగాణ ఏసీబీ

లంచం తీసుకునే వారికి చుక్కలు చూపించే ఏసీబీ.. గతానికి భిన్నంగా కొంతకాలంగా దూకుడుగా పని చేసింది.

Update: 2024-09-09 20:30 GMT

ప్రభుత్వ ఉద్యోగుల్లో అక్రమార్కులకు చుక్కలు చూపించేలా వ్యవహరిస్తోంది తెలంగాణ ఏసీబీ విభాగం. గడిచిన ఎనిమిది నెలల్లో 85 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ట్రాప్ చేసిన వైనం సంచలనంగా మారింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏసీబీ ఇంతటి దూకుడును ప్రదర్శించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. లంచం తీసుకునే వారికి చుక్కలు చూపించే ఏసీబీ.. గతానికి భిన్నంగా కొంతకాలంగా దూకుడుగా పని చేసింది.

ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల వ్యవధిలో 85 మంది వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత ఎక్కువ మందిని ట్రాప్ చేసి అరెస్టు చేయటం వెనుక గత ఏడాది చివర్లో ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ పుణ్యమేనని చెబుతున్నారు. ఆయన చీఫ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి మారిన ఏసీబీ పని తీరుతో ఈ మార్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

అక్రమాలకు పాల్పడే అధికారుల మీద ఫిర్యాదులు వస్తే.. వారికి సంబంధించిన వివరాలపై క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించి.. ఆధారాలు సేకరించిన తర్వాతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్ని నమోదు చేస్తారు. ఇలాంటి వేళల్లో.. కేసులు నమోదైన తర్వాత పలు అంశాలు తెర మీదకు వచ్చి.. నీరుకారే పరిస్థితి. అందుకు భిన్నంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే అలాంటి సమస్యా ఉండదు. సానుభూతి రాదు.

అందుకే.. లంచాలు మరిగిన అధికారుల్ని నేరుగా పట్టుకోవటం మీదనే ఏసీబీ ఎక్కువ ఫోకస్ చేసినట్లు చెబుతారు. ఇదే.. తెలంగాణలో అత్యధిక ఏసీబీ కేసుల నమోదుకు కారణంగా చెబుతున్నారు. 2020లో మొత్తం 94 కేసులు నమోదు అయితే.. 2021లో 98 కేసులు 2022లో115 కేసులు నమోదయ్యాయి. ఇక.. 2023లో 92 కేసులు , 2024 ఆగస్టు నాటికి 145 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ట్రాప్ కేసులు భారీగా ఉండటం విశేషం. 2020 నుంచి ఇప్పటివరకు ట్రాప్ కేసుల్ని చూస్తే.. ఏడాదిలో 75 కేసులు దాటింది లేదు. అందుకు భిన్నంగా ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే 94 ట్రాప్ కేసులు నమోదు కావటం చూస్తే.. తెలంగాణ ఏసీబీ దూకుడు ఏ స్థాయిలో ఉందన్నది అర్థమవుతుంది.

ఏసీబీకి పట్టుబడిన అధికారుల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖకు చెందిన వారే. ఈ ఏడాది ఆగస్టు వరకు నమోదైన మొత్తం కేసుల్లో 32 రెవెన్యూ విభాగానికి చెందినవి కాగా.. రెండో స్థానంలో హోంశాఖ.. పురపాలక.. రవాణా.. రోడ్లు భవనాలు.. పంచాయితీరాజ్ తదితర శాఖలు ఉన్నాయి. ఈ ఏడాది 8 నెలల కాలంలో మొత్తం 109 మందిని అరెస్టు చేశారు. వారిలో 85 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. 24 మంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. మొత్తంగా గతంలోఎప్పుడూ లేనంత జోరుగా తెలంగాణ ఏసీబీ గడిచిన ఎనిమిది నెలల్లో ప్రదర్శించిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News