ఆ నేతల చేరికలపై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు!

ఆ ప్రతిపాదనలను తాము అధిష్టానానికి పంపుతామన్నారు. పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవారినే బీజేపీలో చేర్చుకుంటామన్నారు.

Update: 2024-08-29 17:29 GMT

వైసీపీ ఎంపీలతోపాటు ఆ పార్టీ నేత, ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలపై ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగిరెడ్డిని చేర్చుకుంటున్నామని మేం చెప్పామా అని ఎదురు ప్రశ్నించారు. ఎవరైనా పార్టీలో చేరేందుకు సిద్ధమైనప్పుడు జిల్లా నేతలు చర్చించుకుని రాష్ట్ర నాయకత్వానికి ప్రతిపాదనలు పంపుతారని తెలిపారు. ఆ ప్రతిపాదనలను తాము అధిష్టానానికి పంపుతామన్నారు. పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవారినే బీజేపీలో చేర్చుకుంటామన్నారు.

కాగా వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరే విషయమై తమకు సమాచారం లేదని పురందేశ్వరి తెలిపారు. గుంటూరులో నిర్వహించిన బీజేపీ కిసాన్‌ మోర్చా, ఎస్సీ మోర్చా సమావేశాల్లో భాగంగా పురందేశ్వరి పార్టీలో చేరికలపై స్పందించారు. కొల్లం గంగిరెడ్డి పార్టీలో చేరడంపై తాము నిర్ణయం తీసుకోలేదన్నారు. నేతలను చేర్చుకునే అంశంలో అన్ని స్థాయిల్లో చర్చించే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పార్టీ సిద్ధాంతాలకు అంగీకరిస్తేనే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల చేరికల విషయంలో ఇదే విధానం ఉంటుందన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి చేసిన దుష్ప్రచారం వల్లే తమకు 50–60 సీట్లు తగ్గాయన్నారు. సెప్టెంబర్‌ 2వ తేదీన సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రధాని మోదీ మొదటి సభ్యునిగా పేరు నమోదు చేసుకుంటారని వెల్లడించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదును పెంచేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో నామినేటెడ్‌ పదవుల పంపకంపైనా పురందేశ్వరి హాట్‌ కామెంట్స్‌ చేశారు. పదవుల పంపకంపైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో నలుగురు బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిలో వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అలాగే వైసీపీ ఎమ్మెల్సీల్లో కూడా కొందరు బీజేపీలో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News