2014లోనే బలం లేదంటే... 2024లో ఎలా చిన్నమ్మా...?

నరేంద్ర మోడీ పాలన తొమ్మిదేళ్ళుగా సాగుతున్నా ఏపీలో మాత్రం బీజేపీ ఏ మాత్రం ఎదగలేదని చిన్నమ్మ మాటలను బట్టి అర్ధం అవుతోంది.

Update: 2023-07-16 10:10 GMT

భారతీయ జనతా పార్టీ కొత్త ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర పధాధికారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి అన్నది తేటతెల్లం చేశాయని అంటున్నారు. 2014లో అప్పటి ఏపీ బీజేపీ నేతలు కొందరు ఒంటరి పోరుకు కేంద్ర నాయకత్వాన్ని అనుమతి అడిగితే పార్టీ బలంగా లేదు కాబట్టి ముందు బలోపేతం చేసుకోవాలని సూచించారని పురంధేశ్వరి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పారు. ఆనాడు పొత్తులకే బీజేపీ వెళ్ళి నాలుగు ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లను సాధించింది.

ఇపుడు తొమ్మిదేళ్ళు గడచిన తరువాత బీజేపీ తీరు ఎలా ఉంది అంటే అది కూడా ఆమె చెప్పారు. ఏపీలో ఈ రోజుకీ బీజేపీ బలపడాల్సి ఉందని అన్నారు బూత్ లెవెల్ దాకా బీజేపీ బలాన్ని పటిష్టం చేసుకోవాలని శ్రేణులకు సూచించారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలని కోరారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత నిండుగా ఉందని, దాన్ని సొమ్ము చేసుకోవాలంటే బీజేపీ పటిష్టంగా ఉండాలని ఆమె కోరారు.

అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన తొమ్మిదేళ్ళుగా సాగుతున్నా ఏపీలో మాత్రం బీజేపీ ఏ మాత్రం ఎదగలేదని చిన్నమ్మ మాటలను బట్టి అర్ధం అవుతోంది. ఎన్నికలకు చూస్తే గట్టిగా పది నెలలు కూడా లేదు. ఈలోగా బీజేపీ ఎదుగుతుందా అన్నదే పెద్ద ప్రశ్న. తొమ్మిదేళ్ళ కాలంలో ఎదగని బీజేపీ ఇపుడు లేచి నుంచుని ఏపీలో వైసీపీని ఢీ కొట్టగలదా అన్నదే కీలకమైన మౌలికమైన ప్రశ్న.

ఒక్కసారి 2014 విషయమే తీసుకుంటే ఆనాడు నరేంద్ర మోడీ నరేంద్ర జాలం దేశమంతటా బలంగా పరచుకుంది. అపుడు ఏపీలోనూ బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. అలాంటి టైం లోనే సొంతంగా పోటీకి బీజేపీ రిస్క్ చేయలేక పొత్తులకు వెళ్ళింది. ఇపుడు అంతా ఉల్టా సీదా అయింది. బీజేపీ మీద దేశమంతటా భ్రమలు వీడుతున్నా పరిస్థితి ఉంది.

అటువంటి వేళ బీజేపీని ఏపీలో నిలబడేలా చేయడం అంటే అద్భుతమైన సాహసం అనుకోవాలి. పైగా 2019లో ఒక్క శాతం కంటే కూడా తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయి. ఇపుడు ఆ పార్టీని పాతాళం నుంచి బయటకు లాగడమే అతి పెద్ద కార్యక్రమం. బీజేపీ ఎదగాలి అని నిన్నటిదాకా సోము వీర్రాజు అంటే ఇపుడు చిన్నమ్మ అదే మాట అంటున్నారు. అంతే తప్ప బీజేపీ ఏపీలో పటిష్టంగా ఉంది అని ఎవరూ చెప్పడంలేదు.

ఈ నేపధ్యంలో పొత్తులకు బీజేపీ మరోమారు సిద్ధపడాల్సిన అవసరాన్ని పురంధేశ్వరి చెప్పకనే చెప్పారా అని అంటున్నారు. జనసేనతో అయితే పొత్తు ఉంది. టీడీపీతో పొత్తుకు బీజేపీలో రెండు వర్గాలలో ఒక వర్గం ఆమోదించడంలేదని టాక్ నడుస్తోంది. మరి చిన్నమ్మ మాటలు చూస్తే 2014 నాటి పొత్తులకు బాటలు వేయాలని చూస్తున్నారా లేక జనసేనతో కలసి వెళ్లాలని సూచిస్తున్నారా అన్నది తెలియడంలేదు అంటున్నారు.

Tags:    

Similar News