ఏపీ అడ్వకేట్ జనరల్ గా మళ్లీ ఆయనే!
ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గా మళ్లీ దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులవుతారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో కీలక పదవుల భర్తీపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తోంది. ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గా మళ్లీ దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులవుతారని తెలుస్తోంది.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016– 2019 వరకు దమ్మాలపాటి శ్రీనివాస్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా ఉన్నారు. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
కాగా దమ్మాలపాటి శ్రీనివాస్ ను కూడా వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందనే విమర్శలున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఆయనకు కూడా భూములున్నాయని.. ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయనపై కేసులు మోపింది.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఫ్లాట్ లను రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చి రిటైర్డ్ లెక్చరర్ ను మోసం చేశారనే ఆరోపణలపై మంగళగిరి పోలీసులు దమ్మాలపాటితోపాటు ఆయన భార్య, బంధువులపై కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో తన అరెస్ట్ సహా ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ దమ్మాలపాటి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వతహాగా సీనియర్ న్యాయవాది కావడంతో ఆయన హైకోర్టులో తనకు తానుగా వాదించుకుని ఆ కేసుల నుంచి బయటపడ్డారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు దమ్మాలపాటి టీడీపీ తరఫున ముఖ్యమైన కేసులను వాదిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, తదితర కీలక నేతలపై నమోదైన కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో వారి తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తున్నారు.
ప్రస్తుతం కోర్టుల్లో తెలుగుదేశం పార్టీ, టీడీపీ ముఖ్య నేతల కేసులు వాదిస్తున్న హైకోర్టు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ మళ్లీ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నియామకానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఓకే చెప్పినట్టు సమాచారం.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్. శ్రీరామ్ ను అడ్వకేట్ జనరల్ గా నియమించింది. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్ నియమించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ పదవులకు ఎస్. శ్రీరామ్, పొన్నవోలు సుధాకరరెడ్డి రాజీనామాలు చేశారు. దీంతో ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటికి అవకాశం ఇస్తున్న చంద్రబాబు.. అదనపు అడ్వకేట్ జనరల్ గా ఎవరికి అవకాశం ఇస్తారో వేచిచూడాల్సిందే.