మిమ్మల్ని అరెస్టు చేయడం సరైందే: కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
అంతేకాదు.. తనను అన్యాయంగా అరెస్టు చేశారన్న కేజ్రీవాల్ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది.
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయి, ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్‌ను ఉద్దేశించి ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన అరెస్టును సమర్థించడమే కాకుండా.. అరెస్టు చేసిన తీరును కూడా తప్పుపట్టడానికి లేదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. సామాన్యులకు, మీకు ప్రత్యేకంగా చట్టాలు ఏమీలేవని, భారత చట్టాల్లో అందరూ సమానులేనని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. తనను అన్యాయంగా అరెస్టు చేశారన్న కేజ్రీవాల్ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది.
కేజ్రీవాల్ అరెస్టుకు అవసరమైన ఆధారాలను ఈడీ అధికారులు పోగు చేశారని ఢిల్లీ కోర్టు తెలిపింది. అన్ని ఆధారాలు ఉన్న తర్వాత.. అన్నీనిర్ధారించుకున్నాకే అరె్స్టు చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు సంబంధిం చి తనను అరెస్టు చేయడాన్ని, తనను కస్టడీకి తరలించడాన్ని కొట్టివేయాలని కోరుతూ.. కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కాగా, గత రెండు రోజుల కిందటే.. కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే.. తీర్పును మాత్రం రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా వెలువరించింది.
న్యాయమూర్తి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఈదేశంలో ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులుగా వున్న వ్యక్తులకు ప్రత్యేక చట్టం లేదు. ప్రత్యేకంగా న్యాయం చెప్పాలనే వ్యవస్థలు కూడా లేవు. సామాన్య పౌరులుఎంతో చట్టం ముందు ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రులు కూడా అంతే. మీరు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులు. ప్రత్యేక హక్కులు అంటూ ఏమీ ఉండవు. అంతేకాదు.. మీ వీలును బట్టి కోర్టులు, విచారణ సంస్థలు విచారణ జరపడం సాధ్యం కాదు. విచారణ ఎలా ఉండాలి? ఎప్పుడు జరపాలి? అనే విషయాలను వ్యక్తులు శాసించలేరు. సూచించనూ లేరు'' అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.