కాక రేపిన 'ఢిల్లీ బిల్లు'.. అసలు దీనిలో ఏముంది? ఏం జరుగుతుంది?
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లు
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లు.. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు -2023. ఇదే ఒక్కమాటలో చెప్పాలంటే.. ఢిల్లీ బిల్లు! దీనిపై దేశవ్యాప్తంగా ఎన్డీయే కు మద్దతిస్తున్న పార్టీలను మినహాయిస్తే.. సుమారు 28 పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిని పార్లమెంటులోనూ వ్యతిరేకించాయి. రాజ్యసభలో తాజాగా జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 131 ఓట్లు వస్తే.. ప్రతికూలంగా 102 ఓట్లు పడ్డాయంటేనే.. ఈ బిల్లును ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో.. అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత.. ఈ బిల్లులో ఏముంది? అనే చర్చ ఆసక్తిగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ `239 ఏఏ` ప్రకారం.. ఢిల్లీని అంసెబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా రాజ్యాంగం పేర్కొంది. దీనికి సంబంధించి 69వ రాజ్యాంగ సవరణ కూడా స్పష్టంగా చెబుతోంది. 1991 నుంచి ఇప్పటి వరకు అంటే.. సుమారు 22 సంవత్సరాలుగా ఎలాంటి సమస్య లేకుండా.. అటు కేంద్ర పాలిత ప్రాంతంగా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వంగా కూడా.. ఇక్కడ పాలన సాగిపోతోంది.
అయితే, హఠాత్తుగా ఈ ఢిల్లీ బిల్లును తీసుకురావడం.. తద్వారా.. ఢిల్లీ రాష్ట్రంలోని అధికారుల బదిలీలు, నియామకాలు, వారికి విధుల నిర్దేశం వంటివాటిపై నియంత్రణ వ్యవహారాలను మోడీ ప్రభుత్వం కట్టడి చేసింది. ప్రస్తుతం రెండు దఫాలుగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ విజయం దక్కించుకుంది. అయితే.. ఈ పార్టీ తదనంతర కాలంలో బీజేపీకి కంట్లో నలుసుగా మారింది. ఇటు పంజాబ్‌లో విజయం సాధించి.. అధికారంలోకి రావడం, అటు గుజరాత్‌లోనూ పునాదులు వేసుకుంటుండడంతో ఆప్‌కు చెక్ పెట్టాలనేది అసలు మోడీ సర్కారు వ్యూహం.
ఈ క్రమంలోనే కీలకమైన ఢిల్లీ రాష్ట్రంలో ఇప్పుడు తన సత్తాచాటింది. కేంద్ర పాలిత-అసెంబ్లీ ఉన్న రాష్ట్రంగా రాజ్యాంగంలో పేర్కొన్న దరిమిలా.. దీనిని అడ్డు పెట్టుకుని.. రాష్ట్రానికి ఉన్న కీలకమైన అధికారాలను గుండుగుత్తగా.. తన చేతిలోకి తీసేసుకుంది.
ఏం జరుగుతుంది..?
+ తహశీల్దార్ నుంచిఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల వరకు.. రెవెన్యూ ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయుల వరకు కూడా పోస్టింగ్‌లు, బదిలీలు, విజిలెన్స్, ఇతర ఆకస్మిక సమస్యలపై ఢిల్లీ లో ప్రజాస్వామ్య యుతంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు.
+ ఆయా బదిలీలు, ఇతరత్రా వ్యవహారాలను కేవలం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సిఫార్సులు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం పరిమితం అవుతుంది. అంటే.. ఒక అధికారి అవినీతి చేస్తున్నాడని ఆరోపణలు వచ్చినా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గుర్తించినా.. కూడా ఏమీ చేయలేని దైన్య స్థితికి కేజ్రీవాల్ ప్రభుత్వం చేరిపోతుంది.
+ అధికారుల విచారణలు, సస్పెన్షన్‌లు కేంద్రం అధీనంలో ఉంటాయి.
+ అంతేకాదు.. అత్యంత కీలకమైన నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ సిఫార్సులు అమలు చేయాలా వద్దా కూడా.. సర్కారుకు నిర్ణయం ఉండదు.
+ ఢిల్లీ అసెంబ్లీని ప్రొరోగ్ చేయడం, సమన్లు చేయడం, రద్దు చేయడం వంటి విషయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ తన స్వంత విచక్షణాధికారాన్ని వినియోగించుకునే అధికారం ఉంటుంది.
+ అంటే.. ఒకరకంగా.. కళ్ల ముందే హత్య జరిగినా.. సామాన్యులు ఎలా అయితే.. వ్యవహరిస్తారో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తుంది.
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
గతంలోనే ఢిల్లీ సర్కారు అధికారాలను లాగేసుకునేందుకు మోడీ సర్కారు ప్రయత్నించిందనే ఆరోపణలు రావడంతో కేజ్రీవాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు పబ్లిక్ ఆర్డర్, భూమి, పోలీసులను వదిలి రాజధానిలోని అన్ని రకాల సేవలపై పూర్తి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చింది. అయితే.. ఇప్పుడు తీసుకువచ్చిన బిల్లుతో సంపూర్ణంగా ప్రభుత్వం అచేతనంగా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది.