ధ్రువ్‌ రాఠీ ఎవరు .. ఏమా కథ?

ధ్రువ్‌ రాఠీ హరియాణాలోని రోహతక్‌ లో 1994లో జన్మించారు. జర్మనీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు.

Update: 2024-04-29 07:39 GMT

ధ్రువ్‌ రాఠీ ఇప్పుడంతా దేశవ్యాప్తంగా చర్చల్లోకొస్తున్న పేరు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అతడి పేరు మరింత గట్టిగా వినిపిస్తోంది. సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్‌ అయిన ధ్రువ్‌ రాఠీ తన రాజకీయ విశ్లేషణలతో హాట్‌ టాపిక్‌ గా మారారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ధ్రువ్‌ రాఠీ చేస్తున్న వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ధైర్యమే 2023లో ప్రతిష్టాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ ‘తర్వాత తరం నాయకులు’ జాబితాలో ఆయనను చేర్చడానికి కారణమైంది.

ధ్రువ్‌ రాఠీ హరియాణాలోని రోహతక్‌ లో 1994లో జన్మించారు. జర్మనీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. 2013 జనవరి 8న అతడు తన పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించాడు. ప్రధానంగా రాజకీయ విశ్లేషణలు అందించే అతడి యూట్యూబ్‌ చానెల్‌ కు 18.7 మిలియన్ల మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 697 వీడియోలు చేశారు. వీటిని 261 కోట్ల మందికి పైగా చూడటం విశేషం. వీటిలో ఎక్కువ రాజకీయ, సామాజిక, పర్యావరణ సమస్యలకు చెందిన వీడియోలే. సమస్యను విశ్లేషిస్తూ హిందీలో అతడు చెప్పే విశ్లేషణలకు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు.

ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాని మోదీ లక్ష్యంగా ‘దేశంలో నియంతృత్వం పెరుగుతుందా’ అంటూ ధ్రువ్‌ రాఠీ చేసిన వీడియో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ వీడియో వైరల్‌ గా మారడం అతడిని దేశవ్యాప్తంగా పాపులర్‌ చేసింది.

కేవలంలో హిందీలోనే కాకుండా గత వారం ధ్రువ్‌ రాఠీ తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళం, బెంగాలీలోనూ ఐదు కొత్త యూట్యూబ్‌ చానెళ్లను ప్రారంభించడం విశేషం. ఇవి ధ్రువ్‌ రాఠీ హిందీ వీడియోలకు ఆయా భాషల్లో డబ్బింగ్‌ ఇస్తున్నాయి. ఈ చానెళ్లకు ఒక్క రోజులోనే 1.3 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లు చేరారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతోంది. ప్రజలు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాను దాదాపు నమ్మడం మానేశారు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా ప్రధానంగా ఆయా పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. దాదాపు ఇప్పుడు అన్ని పార్టీలకు సొంత టీవీ చానెళ్లు, సొంత పత్రికలు, మ్యాగజైన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధ్రువ్‌ రాఠీలాంటి వారికి ప్రాధాన్యం పెరుగుతోంది.

ధ్రువ్‌ రాఠీ ఏ పార్టీకి అనుకూలం కాదు. ఆయా పార్టీల విధానాలపై అతడు నిశిత విమర్శలు చేస్తాడు. ఆయా పార్టీల విధానాలు, వాటి వల్ల లాభనష్టాలను వివరిస్తూ అతడు చెప్పే వీడియోలను ఆయా పార్టీల వీరాభిమానులు కూడా చూస్తుండటం విశేషం.

మొదట్లో తాను మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అధ్యాపకుడినని, ట్రావెల్‌ వ్లాగర్‌ , సామాజిక కార్యకర్తనని ధ్రువ్‌ రాఠీ ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత రాజకీయ విశ్లేషణలు చేయడం ప్రారంభించాడు. నిర్భయంగా, నిర్భీతిగా, ఏ పార్టీకి అనుకూలంగా, ఏ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా ఒక అంశాన్ని అన్ని కోణాల్లో వివరించడమే ధ్రువ్‌ రాఠీని ప్రత్యేకంగా నిలిపింది. సివిల్‌ సర్వీసెస్‌ కు సిద్ధమయ్యేవారు కూడా అతడి వీడియోలను చూస్తున్నామని చెప్పడం విశేషం.

కాగా ‘సర్జికల్‌ స్ట్రైక్‌’, ‘అం«ద్‌ భక్తులు – వారి లాజిక్‌’, ‘ఈవీఎం హ్యాకింగ్‌’, ’రియాలిటీ ఆఫ్‌ యోగి ఆదిత్యనాథ్‌’, ’మోదీ యొక్క 3 సంవత్సరాల పాలన

’ ఇలా అనేక వీడియోలు చేశాడు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్‌ అతడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

అయినా సరే ధ్రువ్‌ రాఠీ భయపడలేదు. ఫ్యాక్ట్‌–చెకింగ్‌ వీడియోలను కూడా ప్రారంభించాడు. అలాగే పీ న్యూస్‌ అనే మాక్‌ న్యూస్‌ ప్రోగ్రామ్‌ ను సైతం మొదలుపెట్టాడు. ఇది ప్రముఖ వార్తా చానెళ్లను పేరడీ చేసింది. అలాగే అతను ’ది ధ్రువ్‌ రాఠీ షో’ని కూడా ప్రారంభించాడు,

Tags:    

Similar News