అవార్డు మారింది.. క్రీడల్లో ధ్యాన్ చంద్ స్థానంలో అర్జున!

ఈ ఏడాది నుంచి కొత్తగా "అర్జున జీవిత కాల" పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది.

Update: 2024-10-25 19:30 GMT

హాకీ.. ఒకప్పటి భారత క్రీడా కీర్తి శిఖరం.. ఒలింపిక్స్ బరిలో దిగిందంటే మన జట్టు కచ్చితంగా గోల్డ్ మెడల్ తో రావాల్సిందే అన్నట్లుగా ఉండేది హాకీలో దూకుడు. అందుకే అనధికారిక జాతీయ క్రీడగా అందరి మన్ననలూ పొందింది. దీనంతటికీ మూల కారణం మేజర్ ధ్యాన్ చంద్. 1905 ఆగస్టు 29న జన్మించిన ధ్యాన్ చంద్ దేశానికి 1928, 1932, 1936 ఒలింపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టాడు. ఒకసారి తను గోల్ వేసిన తరువాత అది పడకపోతే తను గోల్ వేసిన విధానం చూసి గోల్ పోస్ట్ కొలతలు సరిచూడాల్సిందిగా అంపైర్ ను కోరేవాడు. హాకీ చరిత్రలోనే ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడైన ధ్యాన్ చంద్.. ఆడిన కాలం హాకీలో స్వర్ణయుగంగా పేర్కొనేవారు. అందుకే ధ్యాన్ చంద్ పేరిట ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డు "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న" గా ప్రదానం చేస్తోంది. దీనిని హాకీ మాంత్రికుడిగా చెప్పుకొనే ధ్యాన్‌ చంద్‌ పేరిట 2002 నుంచి అందిస్తున్నారు.

హాకీని కమ్మేసిన క్రికెట్..

ఓ వెలుగు వెలిగిన హాకీని కాలక్రమంలో క్రికెట్ మేనియా కమ్మేసింది. దీనికి క్రికెట్ ను తప్పుబట్టాల్సిన పని కూడా లేదు. హాకీకి ప్రభుత్వాల ప్రోత్సాహం కొరవడడం.. ఈ ఆట ఆడేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడమూ ఓ కారణమైంది. ఓ దశలో ఒలింపిక్స్ లో భారత జట్టు సాధారణ ప్రదర్శన కూడా చేయలేదు. గత రెండు ఒలింపిక్స్ మాత్రం ఇందుకు మినహాయింపు. భారత జట్టు కాంస్యాలు సాధించడమే దీనికి కారణం. ఒడిసాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఊతం ఇవ్వడంతో భారత హాకీకి కొంత ప్రాభవం దక్కింది.

అవార్డు పేరు మారింది..

ఇప్పటివరకు క్రీడల్లో ప్రతిభ కనబర్చినవారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ధ్యాన్‌ చంద్‌ జీవిత కాల పురస్కారం పేరు మారింది. ఈ ఏడాది నుంచి కొత్తగా ‘‘అర్జున జీవిత కాల’’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. క్రీడా పురస్కారాలను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిరుడు మంజూష కన్వార్‌ (బ్యాడ్మింటన్‌), వినీత్‌ (హాకీ)తో పాటు కబడ్డీ క్రీడాకారిణి కవితకు ధ్యాన్ చంద్ పురస్కారాన్ని అందజేశారు. సహజంగా ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో దేశానికి పతకాలు తెచ్చినవారికి ధ్యాన్ చంద్ పురస్కారాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News