లోకేశ్ వద్ద మంత్రుల పంచాయితీ.. వైసీపీ నేతల చేరికపై అభ్యంతరం
అదేవిధంగా విశాఖ డెయిరీలో అక్రమాలపై శాసనసభా పక్షాన్ని నియమిస్తే, కూటమి పార్టీలతో కనీసం చర్చించకుండా డెయిరీ చైర్మన్ ను బీజేపీలో చేర్చుకోవడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కూటమి పార్టీల్లో వైసీపీ వలస నేతల చేరికపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు మరోసారి వెల్లడైంది. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వైసీపీ నేతల చేరికను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు.. ఈ విషయంపై మిత్రపక్షాలతో చర్చించాలని మంత్రి నారా లోకేశ్ ను కోరారు. గురువారం క్యాబినేట్ భేటీకి ముందు మంత్రులకు లోకేశ్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలను మంత్రులు లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఎన్నికల ముందు తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమిలోకి ఎలా చేర్చుకుంటారని నియోజకవర్గాల్లో నేతలు తమను ప్రశ్నిస్తున్నట్లు మంత్రులు యువనేత లోకేశ్ వద్ద ప్రస్తావించారు. ఈ విషయమై కొన్ని అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం గజపతినగరంలోకి చెందిన వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తే నియోజకవర్గ స్థాయిలో అడ్డుకున్నామని, అయితే వారు తమకు తెలియకుండా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి సమక్షంలో జనసేనలో చేరినట్లు తెలిపారు.
అదేవిధంగా విశాఖ డెయిరీలో అక్రమాలపై శాసనసభా పక్షాన్ని నియమిస్తే, కూటమి పార్టీలతో కనీసం చర్చించకుండా డెయిరీ చైర్మన్ ను బీజేపీలో చేర్చుకోవడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా లోకేశ్ సొంత నియోజకవర్గం నుంచి గంజి చిరంజీవిని చేర్చుకోవడంపై ఆ విషయం మీకు తెలుసు కదా అంటూ సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తాము వ్యతిరేకించి ఐదేళ్లుగా పోరాడుతుంటే, వైసీపీ నేతలు అడ్డదారిలో అధికార కూటమిలో చేరిపోతున్నారని మంత్రులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్.. కూటమి పార్టీలతో ఈ విషయం మాట్లాడతానని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తనకు లేదా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు తెలియజేయాలని సూచించారు.