పేర్ని నానిని అస్సలు వదిలిపెట్టేలా లేరు.. బియ్యం గోడౌన్లకు మైనింగ్ అధికారులు
మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామాంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోడౌన్లపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.
వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ క్రిష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఉచ్చు బిగించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నిని ఏ6గా చేర్చిన పోలీసులు, కోర్టు అనుమతితో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ గిడ్డంగుల నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చాయంటూ మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు.
మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామాంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోడౌన్లపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పటికే ఈ గోడౌన్ లో 7,557 బస్తాల రేషన్ బియ్యం మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు పేర్ని జయసుధను ఏ1గా, పేర్ని నానిని ఏ6గా గుర్తించారు. అయితే ఈ గోడౌన్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు జరిపారని మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన మైనింగ్ అధికారులు గోడౌన్లను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యారు.
క్రిష్ణా జిల్లా మైనింగ్ ఏజీ కొండారెడ్డి ఆధ్వర్యంలోని అధికారులు గోడౌన్ల వద్దకు వెళ్లగా, తాళాలు వేసి ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఉన్నతాధికారులు అనుమతిస్తే గోడౌన్ తాళాలు పోలీసులు, తహశీల్దార్ సమక్షంలో తెరచి తనిఖీలు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో పేర్ని నానిని ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలిపెట్టే పరిస్థితి లేదని విశ్లేషిస్తున్నారు. ఏడున్నర టన్నుల బియ్యం గల్లంతైన సంఘటనకు బాధ్యత వహిస్తూ పేర్ని నాని రూ.1.70 కోట్ల జరిమానా చెల్లించారు. ఇంకా రూ.1.67 కోట్లు చెల్లించాల్సివుంది.
బియ్యం లెక్క తప్పినందుకు బాధ్యత వహిస్తూ పేర్ని నాని డబ్బు చెల్లించడంతో ఆయన తప్పు చేసినట్లు అంగీకరించినట్లైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రభుత్వం దాడి మరింత ఉధ్రుతం చేసిందని అంటున్నారు.