వీడియో వైరల్‌.. మహిళ చెంపపై కొట్టిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత!

తెలుగు రాష్ట్రాల్లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

Update: 2024-05-04 08:33 GMT

తెలుగు రాష్ట్రాల్లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది.

తాజాగా నిజామాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి.జీవన్‌ రెడ్డి మహిళ చెంపపై కొట్టడం వివాదాస్పదమైంది. మహిళను కొట్టిన వివాదంలో ఆయన చిక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే జీవన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ లోక్‌ సభ స్థానం పరిధిలోకి వచ్చే ఆర్మూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని ఓ గ్రామంలో పర్యటించారు. ఆయనతోపాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న ఒక మహిళను ఎవరికి ఓటేస్తున్నావని జీవన్‌ రెడ్డి అడిగారు. మే 13న జరిగే ఎన్నికల్లో ‘పువ్వు’ గుర్తుకు ఓటేస్తానని ఆ మహిళ చెప్పడంతో పక్కనున్న నేతలంతా అంతా ఒక్కసారిగా నవ్వారు. దీంతో జీవన్‌ రెడ్డి వెంటనే ఆ మహిళ చెంపపై చేత్తో కొట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేశానని, అయితే పింఛన్‌ రావడం లేదని ఆ మహిళ వాపోయారు. అందుకే తాను ఈసారి బీజేపీకి వేయాలనుకుంటున్నట్టు తెలిపారు.

కాగా నిజామాబాద్‌ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ అరవింద్‌ పోటీలో ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ పోటీ చేస్తున్నారు. అరవింద్, బాజిరెడ్డి గోవర్థన్‌ ఇద్దరూ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. బాజిరెడ్డి గోవర్థన్‌ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

కాగా జీవన్‌ రెడ్డి ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బరిలోకి దిగిన జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇప్పుడు ఎంపీగా తన అదృష్టాన్ని జీవన్‌ రెడ్డి పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో మహిళ చెంపపై కొట్టడం ద్వారా ఆయన వివాదంలో చిక్కుకున్నారు. ఇది పోలింగ్‌ లో ప్రభావం చూపిస్తే ఆయనకు కొంతమేరకు ఇబ్బంది తప్పదని అంటున్నారు.

https://twitter.com/TheNaveena/status/1786445324820656521
Tags:    

Similar News