పది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు తెలంగాణకు ఎవరంటే?
కొన్ని నెలల తర్వాత ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు వీలుగా గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న విషయం అర్థమైంది.
ఎలాంటి అంచనాలు లేకుండా వీకెండ్ రాత్రి వేళ అనూహ్య రీతిలో పది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఏడుగురు కొత్తగా నియమిస్తే.. మరో ముగ్గురిని మాత్రం ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేశారు. తాజా నియామకాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను మార్చటం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ఎంపీగా పోటీ చేసేందకు వీలుగా తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మొదట్లో ఆమె ప్రకటించలేదు. కొన్ని నెలల తర్వాత ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు వీలుగా గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న విషయం అర్థమైంది.
తమిళ సై ప్లేస్ లో రాదాక్రిష్ణన్ తెలంగాణ ఇంఛార్జి గవర్నర్ గా నియమితులయ్యారు. తాజాగా చేసిన మార్పుల్లో ఆయన్ను మహారాష్ట్రకు పంపారు. అదే సమయంలో తెలంగాణకు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జిష్ణుదేవ్ వర్మను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్ వర్మ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాజకుటుంబానికి చెందిన ఆయనకు భార్య.. ఇద్దరు కొడుకులు ఉన్నారు. తెలంగాణకు ఆయన ఆదివారం రానున్నారు. త్రిపుర బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. అపర రామ భక్తుడిగా ఇమేజ్ ఉంది.
రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరిన ఆయన.. అప్పటి నుంచి పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. మిగిలిన తొమ్మిది రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన గవర్నర్ల వివరాల్ని చూస్తే..జార్ఖండ్ గవర్నర్ గా పని చేస్తూ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీపీ రాధాక్రిష్ణన్ ను మహారాష్ట్రకు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో ఉన్న రమేశ్ బైస్ ను తప్పించారు.
రాజస్థాన్ గవర్నర్ గా ప్రస్తుతం ఉన్న సీనియర్ నేత కల్ రాజ్ మిశ్రాను తప్పించి ఆయన స్థానంలో మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్ రావ్ బాగ్డేను నియమించారు. రాజస్థాన్ బీజేపీ సీనియర్ నేత ఓం ప్రకాశ్ మాథుర్ ను సిక్కిం గవర్నర్ గా నియమితులయ్యారు. అక్కడ గవర్నర్ గా ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్ గా బదిలీ చేశారు. ఆయనకు మణిపూర్ గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించారు. యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ను జార్ఖండ్ గవర్నర్ గా నియమించారు. అసోం మాజీ ఎంపీ రమెన్ డేకాను ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమించారు. ఛత్తీస్ గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ కాలం పూర్తైంది.
కర్ణాటక మాజీ మంత్రి సీహెచ్ విజయశంకర్ ను మేఘాలయ గవర్నర్ గా నియమించారు. ఆయన స్థానంలో ఉన్న ఫగు చౌహాన్ ను తప్పించారు. అసోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్ గానూ.. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు. ఇప్పటిదాకా ఇక్కడే అదనపు బాధ్యతలు నిర్వహించిన పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె.కైలాసనాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. గుజరాత్ కు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో ఆయనకు కైలాసనాథన్ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. మోడీ తర్వాత గుజరాత్ కు సీఎంలుగా వ్యవహరించిన వారందరికి ఆయన ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. మొత్తంగా ఆయన్ను పదకొండుసార్లు పదవీ కాలాన్ని పొడిగించటం గమనార్హం. తాజాగా ఆయన పదవీ కాలం పూర్తైన వేళ.. ఈసారి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎంపిక చేయటం విశేషం.