రెస్టారెంటులో ఘోరం... 44 మంది మృత్యువాత!
భారీగా మంటలు చెలరేగి పక్కనున్న భవనాలను కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 29 రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 44 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఏడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 44 మంది మృతి చెందారు. ఈ ఘోర దుర్ఘటనలో సుమారు 40మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారీగా మంటలు చెలరేగి పక్కనున్న భవనాలను కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ ప్రమాదం నుంచి సుమారు 70మందిని కాపాడారు.
కాగా ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 29 రాత్రి 10గంటల సమయంలో ఢాకాలోని బెయిలీ రోడ్డులోని ఒక ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ లో ఈ మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు వేగంగా మిగిలిన అంతస్తులకు వ్యాపించడంతో భవనంలోనివారు మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు. మంటలు వేగంగా వ్యాపించడం.. తప్పించుకునే దారి లేకపోవడంతో 44 మంది మృత్యువాత పడ్డారు.
ఈ ఏడు అంతస్తుల భవనంలోని దాదాపు అన్ని అంతస్తుల్లో రెస్టారెంట్లతో పాటు వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ దుకాణాలు ఉన్నాయని చెబుతున్నారు. రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
మంటలు వ్యాపించడాన్ని గమనించిన కొందరు భవనం పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు భవనం పైభాగానికి చేరుకొని సాయంకోసం హాహాకారాలు చేశారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ ప్రమాదంలో సుమారు 40 మందికిపైగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించింది. బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సమంతా లాల్ సేన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో 44 మంది మరణించారని తెలిపారు. 22 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.