అసెంబ్లీకి జగన్ దూరం ?

మరి అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన వస్తారు అన్న వారు ఉన్నారు. రారు అని అంటున్న వారూ ఉన్నారు అయితే జగన్ మదిలో ఏముందో ఎవరికీ తెలియదు.

Update: 2024-06-13 13:50 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 లేదా 19 నుంచి ప్రారంభం అవుతాయని టాక్ నడుస్తోంది. 17 మంచి రోజు ఏకాదశి తిథి ఉంది. అయితే అదే రోజున బక్రీద్ పండుగ కావడంతో 19 తేదీ బుధవారం మంచి ముహూర్తం ఉన్నందున ఆ రోజు జరిగే అవకాశాలు ఉండొచ్చు అని అంటున్నారు. ఏది ఎమైనా మరో వారం రోజుల వ్యవధిలో కొత్త అసెంబ్లీ సమావేశం కావడం ఖాయం.

ఈ నెలాఖరుతో ఓటాను అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగుస్తుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ని అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి ఆమోదించుకోవాలి. అలాగే కొత్త సభ్యులు అంతా అసెంబ్లీ ప్రమాణం చేయాలి. స్పీకర్ ఎన్నిక జరగాలి. అందువల్ల అసెంబ్లీ సమావేశాలు సాధ్యమైనంత తొందరలో నిర్వహిస్తారు.

మరి అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన వస్తారు అన్న వారు ఉన్నారు. రారు అని అంటున్న వారూ ఉన్నారు అయితే జగన్ మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్సీల సమావేశంలో మాత్రం జగన్ అన్న మాటలు చూస్తే ఆయన అసెంబ్లీకి దూరంగానే ఉంటారు అన్నది చూచాయగా తెలుస్తోంది అని అంటున్నారు.

వైసీపీ ఎమ్మెల్సీలే ఇక మీదట ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని జగన్ దిశానిర్దేశం చేశారు. అధికార పక్షం నోరెత్తనీయదని అయినా గట్టిగానే పోరాటం చేయాలని ఆయన సూచించారు. ముప్పయి మందికి పైగా ఎమ్మెల్సీలతో మెజారిటీ ఉన్న చోటనే అధికార పక్షం నోరెత్తనీయదు అని జగన్ భావిస్తున్నారు అంటే పట్టుమని పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఉన్న అసెంబ్లీలో ఏ విధంగా కట్టడి చేస్తుంది అన్నది బహుశా జగన్ ఊహించకుండా ఉండరు.

అసెంబ్లీ మొత్తం మీద టీడీపీ కూటమి పరచుకుని ఉంది. అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నదే లేదు. దాంతో ఏ విధంగానూ వైసీపీ అడుగు పెట్టే వీలు లేదు. అయితే జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యల మీద చర్చించాలనుకున్నా అక్కడ కుదరదు అని అంటున్నారు. దాంతో జగన్ కొంత సమయం చూసి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళి అక్కడే తేల్చుకోవాలనుకుంటున్నారు అని తెలుస్తోంది.

మొత్తం మీద ఎమ్మెల్సీల భుజ స్కంధాల మీదనే జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించే బాధ్యతను పెట్టేశారు. కొంతకాలం పాటు చట్ట సభలలో గట్టిగా పోరాటం చేయాల్సిందే. జనం మూడ్ చూసి అపుడు ప్రజా పోరాటాలు చేయవచ్చు అన్నది జగన్ ఆలోచనగా ఉంది. అదే ఆయన చెప్పుకొచ్చారు. మరి జగన్ చెప్పినట్లుగా శాసన మండలిలో మెజారిటీ ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలు పోరాటం చేయగలరా అన్నదే చర్చగా ఉంది.

జగన్ విషయం తీసుకుంటే ఆయన కేసీఆర్ మాదిరిగానే అసెంబ్లీకి దూరంగా ఉంటారు అని అంటున్నారు. మరి కేసీఆర్ కి అయితే కేటీఆర్ హరీష్ రావు సహా కీలక నేతలు అంతా అసెంబ్లీలో మాట్లాడేందుకు ఉన్నారు. జగన్ పెద్దిరెడ్డి తప్ప పెద్దగా ఎవరూ కనిపించని ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో వైసీపీ సాధించేది ఏమిటి అన్న చర్చ కూడా వస్తోంది.

Tags:    

Similar News