జనసేన బీజేపీలో విలీనంపై దుమారం...!

ఆయన మనసులో ఉన్న దాన్ని బయట పెట్టడం వల్లనే అవి వివాదాలు అవుతున్నాయి.

Update: 2024-03-20 14:36 GMT

జనసేన పార్టీలో గందరగోళం వివాదాలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు కారణం అని అంటున్నారు. పవన్ రాజకీయాల్లో కొన్ని బయటకు చెప్పాల్సినవి ఉంటాయని కొన్ని చెప్పకూడనివి ఉంటాయని తెలుసుకోవడంలేదు అని అంటున్నారు. ఆయన మనసులో ఉన్న దాన్ని బయట పెట్టడం వల్లనే అవి వివాదాలు అవుతున్నాయి.

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్ధిగా ఉదయ్ శ్రీనివాస్ ని ప్రకటించిన పవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని బీజేపీ ముఖ్య నేతలు కోరితే అపుడు తాను ఎంపీగా వెళ్తాను అని చెప్పారు. ఆ సమయంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉదయ్ శ్రీనివాస్ ఉంటారని అన్నారు.

ఇది పెద్ద దుమారంగా మారింది. దీని మీద వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే పవన్ కి ఒక బిగ్ చాలెంజ్ చేశారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడి సాక్షిగా పవన్ ప్రమాణం చేసి ఒక నిజం చెప్పాలని డిమాండ్ చేసారు.

ఎన్నికల తరువాత జనసేనను బీజేపీలో పవన్ విలీనం చేయబోతున్నారు అని ఆయన అన్నారు. ఈ మాట నిజం కాదు అని పవన్ చెప్పాలని నిలదీశారు. బీజేపీ ముఖ్య నేతలు చెబితే తాను ఎంపీగా పోటీ చేస్తాను అని పవన్ అనడమేంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ముఖ్య నేతలు హై కమాండ్ అయినపుడు జనసేన విలీనం నిజమే అవుతుందని ఆయన లాజిక్ పాయింట్ తీస్తున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కి ఓటములు అలవాటే అని అన్నారు. గాజువాక భీమవరంలో ఆయన పోటీ చేసి ఓటమి పాలు కాలేదా అని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని అక్కడ లోకల్ క్యాండిడేట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను ఓడించడం పవన్ వల్ల కాదని అన్నారు.

ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటున్నారు ఆయన అన్నారని కాదు కానీ పవన్ ఒక పార్టీ అధినేత అయి ఉండి బీజేపీ ముఖ్య నేతలు చెప్పితే తాను పాటిస్తాను అనడమేంటని చర్చ సాగుతోంది.ఒక రాజకీయ పార్టీ మీద ఆ పార్టీ అధినాయకత్వానికే అన్ని హక్కులు ఉంటాయని పక్క పార్టీల నుంచి ఆదేశాలు ఎందుకు వస్తాయని అంటునారు.

ఇక పవన్ మనసులో ఆలోచన ఏంటి అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. పిఠాపురం అసెంబ్లీ సీటుతో పాటు కాకినాడ ఎంపీ సీటుని కూడా తీసుకోవాలని జనసేనకు ఉందని అయితే పవన్ తప్పించి వేరే ఎవరు పోటీ చేసినా తాను పోటీకి రెడీ అని మాజీ ఎమ్మెల్యే వర్మ అంటున్నారు. మొత్తానికి పవన్ పిఠాపురం పర్యటన ఆయన పోటీ చేసే సీటు విషయంలో ఇంకా అయోమయం ఉండేలా చేశారని అంటున్నారు. అదే టైం లో జనసేన బీజేపీలో విలీనం అవుతుందని వైసీపీ నేతలు కొత్త ప్రచారం స్టార్ట్ చేశారు. వీటి విషయంలో క్లారిటీ ఏ విధంగా ఇస్తుందో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News