అమెరికా అధ్యక్షుడికి ఆ ‘రోగం’ లేదట!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల పోటీలో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల పోటీలో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ బరిలోకి దిగడం ఖాయమైంది. ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడానికి ఆయన అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలే కారణమని చర్చ జరుగుతోంది.
జో బైడెన్ వ్యవహార శైలి ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు 81 సంవత్సరాలు. ఇంత పెద్ద వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కూడా జో బైడెన్ కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో జో బైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోందని అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ వైద్యులు తాజాగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ ఈ మేరకు తెలిపినట్టు ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్టు తెలిపింది. బైడెన్ ఆరోగ్యంపై తాము డాక్టర్ కెవిన్ ను ప్రశ్నించగా బైడెన్ ఆరోగ్యం అద్భుతంగా ఉందని ఆయన చెప్పినట్టు వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. అలాగే పదవీకాలం పూర్తయ్యే వరకు బైడెనే పదవిలో ఉంటారని.. అధ్యక్ష పదవి విషయంలో ఏ మార్పు ఉండబోదని డాక్టర్ కెవిన్ ధ్రువీకరించారని స్పష్టం చేసింది.
ముఖ్యంగా జో బైడెన్ కు పార్కిన్సన్ వ్యాధి ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంపై డాక్టర్ కెవిన్ స్పందించారు. బైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని.. ఆయనకు ఎలాంటి మతిమరుపు జబ్బు లేదని తేల్చిచెప్పారు.
కాగా ఇటీవల జీ7 దేశాల సమావేశానికి ఇటలీకి వెళ్లిన జో బైడెన్ అక్కడ ఆ దేశాల అధినేతలు గ్రూప్ ఫొటోకి పోజు ఇస్తుంటే.. ఉన్నట్టుండి పక్కకు వెళ్లిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా వారికి చేతులెత్తి అభివాదం చేశారు. ఇటలీ ప్రధాని జోక్యం చేసుకుని ఆయన చేయిపట్టుకుని గ్రూప్ ఫొటో దిగడానికి తీసుకురావాల్సి వచ్చింది. దీంతో జో బైడెన్ కు ఏమైందని అప్పుడే ఊహాగానాలు చెలరేగాయి. వృద్ధాప్య సమస్యలు, మతిమరపుతో ఆయన బాధపడుతున్నారని టాక్ నడిచింది.
ఈ ఘటన మరిచిపోకముందే కొద్ది రోజులకు మరోసారి అలాంటిదే పునరావృతమైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో డెమోక్రటిక్ పార్టీ విరాళాలను సేకరించింది. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా పాల్గొన్నారు. అక్కడ 45 నిమిషాలపాటు జిమ్మీ కిమ్మెల్.. ఒబామాను, జో బైడెన్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో వారిద్దరూ ఆ కార్యక్రమానికి హాజరైనవారందరికీ నమస్కరించారు.
కార్యక్రమం ముగిశాక బరాక్ ఒబామా స్టేజీ దిగి వచ్చేస్తుండగా జో బైడెన్ మాత్రం అలాగే అక్కడే ఉండిపోయారు. కట్టుకొయ్యలాగా స్టేజీపైనే ఎటూ కదలకుండా బిగుసుకుపోయారు. దీంతో ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న బరాక్ ఒబామా వెనక్కి వచ్చి జో బైడెన్ చేతిని పట్టుకుని తీసుకువెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. దీంతో అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి పుకార్లు చెలరేగాయి. ఆయన వృద్ధాప్య సమస్యలు, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అనుమానించారు. అయితే జో బైడెన్ ఆరోగ్యంగా ఉన్నారని అటు అమెరికా అధ్యక్షుడి కార్యాలయం, ఆయన సతీమణి అప్పట్లో చెప్పారు.
కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పార్కిన్సస్ వ్యాధి ఉందనే గాసిప్స్ నడిచాయి. అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ కు న్యూరాలజీ డాక్టర్ తరచూ వస్తుండటం ఈ అనుమానాలకు ఆజ్యం పోసింది. బైడెన్ కు ఉన్న ఆ వ్యాధికి చికిత్స చేయడం కోసమే వైద్యుడు వైట్ హౌజ్ కు వస్తున్నారనే టాక్ నడిచింది.
ఈ నేపథ్యంలో జో బైడెన్ ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఈ వార్తలను అప్పట్లో తీవ్రంగా ఖండించారు. వైట్ హౌజ్ కు తరచుగా న్యూరాలజిస్ట్ రావడంపై ఆయన ఒక అధికారిక లేఖ విడుదల చేశారు. అధ్యక్షుడు బైడెన్ కు పార్కిన్ సన్స్ వ్యాధి లేదని కుండబద్దలు కొట్టారు. ఆయన ఈ వ్యాధి కోసం ఎలాంటి వైద్య సేవలు పొందడం లేదన్నారు.
వైట్ హౌజ్ లో ఉండే వందలాది మంది సిబ్బంది ఎదుర్కొనే మానసిక సమస్యలకు చికిత్స చేయడానికే న్యూరాలజిస్ట్ వైట్ హౌజ్ కు ఎక్కువగా వస్తున్నారని కెవిన్ వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఆయన మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని మరోసారి ధ్రువీకరించారు.