డెమోక్రాట్లపై ట్రంప్ వెటకారం మామూలుగా లేదుగా!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ 47.9 శాతం (7,09,16,946) ఓట్లతో 226 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా... 50.5 శాతం (7,46,50,754) ఓట్లతో 312 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపొందారు డొనాల్డ్ ట్రంప్.
ఈ నేపథ్యంలో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో పక్క ఈ ఎన్నికల్లో డెమోక్రట్ల అభ్యర్థి కమలా హారిస్ కు వచ్చిన ప్రచార విరాళాలు అన్నీ అయిపోయాయని.. పైగా 20 మిలియన్ డాలర్లు అప్పు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో... వీటిపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 1 బిలియన్ డాలర్లకు పైగా ప్రచార విరాళాలు సేకరించారు. అయితే... ఎన్నికలు ముగిసే సమయానికి ఆ మొత్తం ఖర్చు అయిపోగా.. మరో 20 మిలియన్ డాలర్లు అప్పులో ఉన్నట్లు పలు వార్తా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి.
కమలా హారిస్ తరుపున పనిచేసిన సిబ్బందికి సంబంధించిన చెల్లింపుల్లో కూడా ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సదరు కథనాల్లో పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో గెలిచిన హుషారులో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ల ఆర్థిక పరిస్థితిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇందులో భాగంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విరాళాలు సేకరించి పోరాడిన డెమోక్రాట్ల వద్ద డాలర్లు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని ట్రంప్ అన్నారు. ఇదే సమయంలో... ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి ఆర్థిక సహాయం చేయడానికి నా మద్దతుదారులు ముందుకు రావాలని కోరుతున్నట్లు వ్యంగంగా స్పందించారు.
దీంతో... ట్రంప్ గురించి ఇప్పటివరకూ ప్రపంచానికి తెలిసిన వాటితో పాటు వెటకారం కూడా ఎక్కువే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.