వైసీపీ ఇంచార్జి దువ్వాడ వాణి తిట్ల పురాణం వైరల్
తాజాగా ఆమె తన వద్ద పనిచేసే మాజీ డ్రైవర్ తప్పుడు ప్రచారం చేసినట్లుగా భావించి అతని మీద ఫోన్ లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి కీలకమైన సీటు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు ఇది. 2014, 2019లలో వరసగా గెలిచిన అచ్చెన్నాయుడు 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి చోట్ల సరైన అభ్యర్ధి కోసం వైసీపీ వేటాడుతూ చివరికి టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి పేరుకు ఫిక్స్ అయింది.
ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి ఓడారు. 2019లో పేడాడ తిలక్ కూడా అచ్చెన్న మీద ఓడారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ కే టెక్కలి బాధ్యతలను మొదట్ల అప్పగించిన వైసీపీ మహిళా సెంటిమెంట్ అని ఆయన భార్యను రంగంలోకి దింపింది.
ఆమె అయితే టెక్కలి సీటు తన పరం అవుతుంది అని భావిస్తోంది. అయితే దువ్వాడ వాణి కూడా ఫైర్ బ్రాండ్ గానే పేరు తెచ్చుకుంటున్నారు. ఆమె సైతం భర్త దువ్వాడ శ్రీనివాస్ మాదిరిగానే పెద్ద నోరు చేసుకుంటున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీకి ఉన్న సింపతీ కూడా పోతోంది అని అంటున్నారు.
తాజాగా ఆమె తన వద్ద పనిచేసే మాజీ డ్రైవర్ తప్పుడు ప్రచారం చేసినట్లుగా భావించి అతని మీద ఫోన్ లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనతో ఈ ఫోన్ సంభాషణ కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మాజీ డ్రైవర్ ని ఉద్దేశించి దువ్వాడ వాణి తిట్ల పురాణం కూదా వైరల్ అవుతోంది. దీంతో విన్న వారు అంతా ముక్కున వేలేసుకుంటున్న నేపధ్యం ఉంది. టెక్కలిలో బలమైన అభ్యర్థి అజేయుడు అయిన అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయనతో పోరాటం చేయడం కష్టమని తెలుసు. అయినా వైసీపీ సర్వశక్తులు ఒడ్డాల్సిన నేపధ్యం ఉంది.
అయితే దువ్వాడ దంపతుల వైఖరి కారణంగా టెక్కలిలో అత్యధిక శాతం ఉన్న కాళింగ సామాజికవర్గం నుంచి కూడా సింపతీ రావడం లేదు అని అంటున్నారు. ఇప్పటికే టెక్కలి వైసీపీలో వర్గ పోరు ఉంది. దానికి తోడు అన్నట్లుగా ఇపుడు దువ్వాడ వాణి తిట్ల పురాణంతో ఎలాంటి పరిణామాలు వస్తాయో అని పార్టీలో చర్చ సాగుతోంది.
టెక్కలికే చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఉన్నారు. ఆమెకు టికెట్ ఇస్తే బాగుండేది అన్న భావన ఉంది. కానీ వైసీపీ హై కమాండ్ ఎందుకో దువ్వాడ ఫ్యామిలీ వైపే మొగ్గు చూపిస్తుంది. అయితే భర్త లేకపోతే భార్య అంటూ టెక్కలి బాధ్యతలు వారికే అప్పగించింది. అయితే దువ్వాడ ఫ్యామిలీ ఒంటెత్తు పోకడలతో వైసీపీకి కొత్త చిక్కులు వస్తున్నాయని అంటున్నారు. దానికి తోడు నోటి దురుసులో ఉన్న సింపతీని కూడా లేకుండా చేసుకుంటున్నారు అని చర్చించుకుంటున్నారు.