వద్దురా నాయనా .. పట్టభద్రుల పరేషాన్ !
ఆ ఎన్నికల్లో పల్లా గెలవగా, తీన్మార్ మల్లన్న రెండవ, కోదండరాం మూడవ స్థానంలో నిలిచారు.
తెలంగాణలో లోక్ సభ, ఏపీలో శాసనసభ, లోక్ సభ పోలింగ్ అయిపోవడంతో అంతా జూన్ 4 న విడుదలయ్యే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. సందట్లో సడేమియాలా తెలంగాణలో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చిపడింది.
గత ఎన్నికల్లో స్వతంత్రంగా నిలబడ్డ చింతపండు నవీన్ ఆలియాస్ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం, బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పల్లా గెలవగా, తీన్మార్ మల్లన్న రెండవ, కోదండరాం మూడవ స్థానంలో నిలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున బిట్స్ పిలానీ గోల్డ్ మెడలో రాకేశ్ రెడ్డి, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న. బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరి తరపున అన్ని పార్టీల అధినేతలు విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రచారాన్ని కీలక దశకు చేర్చారు. ఈ నెల 27న దీనికి పోలింగ్ జరగనుంది.
అయితే అభ్యర్థుల ప్రచారం చూసి పట్టభద్రులు ఈసారి హడలి పోతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నాయి.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 4.61 లక్షల మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరి ఫోన్ నంబర్లను సేకరించిన అభ్యర్థులు పట్టభద్రులకు రోజులో ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది నుంచి 12 ఫోన్ కాల్స్ చేస్తున్నారు. దీంతో ఫోన్ మోగిందంటే పట్టభద్రులు భయపడే పరిస్థితి నెలకొంది. ఒక్కో అభ్యర్థి మూడు, నాలుగు రకాలుగా కాల్స్ చేస్తున్నారు. కొన్ని కాల్స్ నిమిషం నిడివి ఉన్నవి కాగా, మారికొన్ని 30-40 సెకండ్ల నిడివి గల రికార్డెడ్ కాల్స్ చేస్తున్నారు. మరి కొందరు అభ్యర్థులు తమను తాము పరిచయం చేసుకుంటూ ఇతర పార్టీలను విమర్శిస్తూ 3-4 నిమిషాల రికార్డెడ్ కాల్స్ కూడా చేస్తున్నారు.దీంతో పట్టభద్రులు తీవ్రంగా విసిగిపోతున్నారు.