బిగ్ బ్రేకింగ్ : జగన్ కి ఈసీ నోటీసులు...!
అంతే కాదు చంద్రబాబుని హంతకుడు అని ఎందుకు అనకూడదని జగన్ అన్నట్లుగా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న దాని మీద ఈసీ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 3న పూతలపట్టులో జరిగిన సిద్ధం సభలో చంద్రబాబు మీద జగన్ పరుషమైన వ్యాఖ్యలు చేశారు అని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ మీటింగులో వాలంటీర్ల సేవలను రద్దు చేయించేందుకు చంద్రబాబు చూశారని ఆయన కారణంగానే 31 మంది అవ్వా తాతలు చనిపోయారని జగన్ అన్నట్లుగా టీడీపీ చెబుతోంది. అంతే కాదు చంద్రబాబుని హంతకుడు అని ఎందుకు అనకూడదని జగన్ అన్నట్లుగా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ నలభై ఎనిమిది గంటల లోగా జగన్ దీనికి సరైన వివరణ ఇవ్వాలని సూచించింది. జగన్ దీని మీద ఏమి జవాబు చెబుతారో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు జగన్ మీద చంద్రబాబు అనుచితమైన కామెంట్స్ చేశారు అన్న దాని మీద ఈసీ నోటీసులు జారీ చేసింది.
దాంతో ఇపుడు జగన్ కి ఈసీ నోటీసులు ఇవ్వడంతో ఈసీ ఇద్దరు నేతల విషయంలో సరైన నిర్ణయం తీసుకుందని నిష్పాక్షికంగా వ్యవహరించింది అని అంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం జగన్ కి నోటీసులు ఇవ్వడం పట్ల కొంత ఆవేదనకు గురి అవుతున్నారు.
చంద్రబాబు ప్రతీ రోజూ మీటింగులలో జగన్ ని పట్టుకుని నారా రకాలుగా దుర్భాషలు ఆడుతున్నారని బచ్చా అంటూ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ జగన్ మీద నేరాలను ఆపాదిస్తూ కోర్టులో ఉన్న అంశాలను చంద్రబాబు లోకేష్ ప్రస్తావిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు జగన్ ని ముఖ్యమంత్రి స్థాయి కూడా చూడకుండా దిగజారి మాట్లాడుతున్నారని వారు అంటున్నారు.
చంద్రబాబుకు ఈసీ నోటీసులు ఇచ్చినా ఆయన ఇంకా తన భాషను తీరుని మార్చుకోలేదని కేవలం ముఖ్యమంత్రినే కాకుండా మంత్రులను ఇతర నేతలను కూడా విమర్శిస్తూనే ఉన్నారని అంటున్నారు. మరి వైసీపీ కూడా వీటి మీద ఫిర్యాదు చేస్తోంది. అలాగే టీడీపీ నేతలు వైసీపీ మీద ఫిర్యాదు చేస్తున్నారు.
కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది అన్ని రాజకీయ పార్టీలు పాటించాలని దాని కంటే ముందు అధినేతలు సహనంతో ఉండాలని ఈసీ సూచిస్తోంది. కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నేతలు హాట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాంతోనే ఈసీ నోటీసులు ఇవ్వక తప్పడంలేదు అని అంటున్నారు. మరి ఎన్నికల ప్రచారానికి ఇంకా 33 రోజుల టైం ఉన్నందువల్ల మరెన్ని విమర్శలు చేస్తారో ఈసీ నోటీసులు ఎందరికి ఇస్తుందో చూడాల్సి ఉంది.