ఏ క్షణంలో అయినా కవిత అరెస్టు.. నిజమెంత?
ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని సీఎం కేజ్రీవాల్ ను.. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంచలన పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు జరిగిన అరెస్టులు ఒక ఎత్తు అయితే.. తాజాగా జరిగే అరెస్టు మరో ఎత్తుగా అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ మద్యం స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏ క్షణంలో అయినా అరెస్టు చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఆదివారం నుంచి ఈ వాదన జోరు తెలంగాణ రాజకీయ వర్గాల్లో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. లిక్కర్ స్కాంలో కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందినట్లుగా చెబుతున్నారు.
ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని సీఎం కేజ్రీవాల్ ను.. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. కవిత అరెస్టుకు ముందు.. ఆమెను విచారణకు ఈడీ ఆహ్వానిస్తుందని.. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటిస్తారని చెబుతున్నారు.
అయితే.. ఈ అరెస్టు వెనుక పెద్ద వ్యూహం ఉందన్న వాదనను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కవితను జైల్లో పెట్టి.. రెండు నెలల పాటు కటకటాల్లో ఉంచేసి.. ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలవటమే తాజా ఎత్తుగడగా ఆయన అభివర్ణిస్తున్నారు. రేవంత్ మాటల్లో నిజం ఎంతన్న విషయాన్ని పక్కన పెడితే.. కవిత అరెస్టుకు రంగం సిద్ధమైందన్న మాట వినిపిస్తోంది.
ఆమ్ ఆద్మీ నేతలకు సౌత్ గ్రూప్ తరఫున అభిషేక్ బోయినపల్లి.. కవిత ఢిల్లీ పీఏ అశోకం.. ముత్తా గౌతమ్ రూ.100 కోట్లు తరలించారంటూ ఈడీ పక్కా ఆధారాల్ని సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కాంలో నిందితులుగా ఉన్న అశోక్ కౌశిక్ తో పాటు ముత్తా గౌతమ్ లు తామే రూ.45 కోట్ల వరకు తరలించినట్లుగా దర్యాప్తు సంస్థల ముందు అంగీకరించినట్లుగా సమాచారం. సౌత్ గ్రూప్ లో తాను కవిత తరఫున అభిషేక్ బినామీగా వ్యవహరించినట్లుగా ముత్తా గౌతమ్ దర్యాప్తు సంస్థల ఎదుట చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను స్వయంగా రూ.7.1 కోట్లు తరలించినట్లుగా చెబితే.. మరో నిందితుడు దినేశ్ అరోరా సైతం తాను కూడా రూ.17 కోట్లు తరలించినట్లుగా ఒప్పుకున్నట్లుగా తెలిసింది.
ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న పలువురు అఫ్రూవర్ గా మారటం.. వారిచ్చిన సమాచారం ఆధారంగానే కవిత అరెస్టు జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. హైదరాబాద్ నుంచి నగదు తరలింపునకు సంబంధించి శరత్.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. రాఘవ దర్యాప్తు సంస్థలకు వివరాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ బిజినెస్ గురించి కవితతో మాట్లాడాలని.. కలిసి పని చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాలే తనకు చెప్పినట్లుగా శరత్ చంద్రారెడ్డి.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా నిందితులు అఫ్రూవర్ గా మారి.. వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరుగుతుందన్న అభిప్రాయం జోరుగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.