ఇక పిల్లలను దానికి ఉపయోగించుకుంటే కఠిన చర్యలే!
మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే
మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో మునిగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు జారీ చేసింది.
రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించుకోవద్దని సూచించింది. పిల్లలను ప్రచారంలో ఉపయోగించినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పోస్టర్లు, కరపత్రాల పంపిణీ, పిల్లలతో నినాదాలు చేయించడం వంటివి చేయించవద్దని సూచించింది.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు అనేక రకాల పబ్లిసిటీ స్టంట్స్ ను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలను ఎత్తుకోవడం, వారికి స్నానాలు చేయించడం, వారితో రాజకీయపరమైన నినాదాలు చేయించడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో ఇలాంటివాటికి అడ్డుకట్ట పడనుంది.
ఈ మధ్య రాజకీయ నేతలు పిల్లలను తమ పార్టీల ప్రచారం కోసం వాడుకుంటున్నారని.. ఈ పరిణామం మంచిది కాదని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరింది.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని ఆయా రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు ఇచ్చింది. బాలకార్మిక చట్టాలను కచ్చితంగా పాటించాలని కోరింది. ఈ విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నట్లు స్పష్టం చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. తమ ఎన్నికల ర్యాలీలు, ప్రచార కార్యకలాపాల్లో పిల్లలను చేర్చుకోకూడదు. పోస్టర్లు, కరపత్రాల పంపిణీ, నినాదాలు, ప్రచారగీతాలు.. ఇలా ఎక్కడా వారిని ఉపయోగించకూడదు. ప్రచార కార్యక్రమాల్లో నేతలు చిన్నారులను ఎత్తుకోవడం, వాహనాల్లో తీసుకెళ్లడం కూడా నిషేధం. కాబట్టి ఈ అంశాల్లో అభ్యర్థులు, పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
అలాగే రాజకీయ పార్టీలు, అభ్యర్థులకే కాకుండా ఎన్నికల సంబంధిత పనులు, కార్యకలాపాల్లో చిన్నారులను చేర్చుకోవద్దని ఎన్నికల అధికారులు, యంత్రాంగానికి కూడా ఎన్నికల సంఘం సూచించింది. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులదేనని తేల్చిచెప్పింది. ఎన్నికల యంత్రాంగం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.