మరో 48 గంటల్లో మైకులు బంద్.. పరుగులు పెడుతున్న నేతలు
అయితే.. ఇన్ని రోజులు కాస్తా.. ఇప్పుడు రెండు రోజులకు వచ్చేసింది. శుక్రవారం పూర్తిగా, శనివారం సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది.
సుదీర్ఘంగా సాగిన ఏపీ ఎన్నికల ప్రచారానికి మరో 48 గంటల్లో తెరపడనుంది. మార్చి 16న విడుదలైన ఎన్నికల షెడ్యూల్ నుంచి మే 13న జరిగే పోలింగ్ వరకు మధ్యలో దాదాపు 58 రోజులు ఉండడంతో నాయకులు, పార్టీలు కూడా.. అమ్మో ఇన్ని రోజులా అని నాయకులు పార్టీలు కూడా ఆశ్చర్యపోయాయి. అయితే.. ఇన్ని రోజులు కాస్తా.. ఇప్పుడు రెండు రోజులకు వచ్చేసింది. శుక్రవారం పూర్తిగా, శనివారం సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది. ఆదివారం(మే 12) కూలింగ్ పిరియడ్. సోమవారం(మే 13) పోలింగ్ జరగనుంది.
ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు నాలుగోదశలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార వైసీపీ మరోసారి అధికారం దక్కించుకునే కసితో ముందు నుంచి పక్కా ప్లాన్‌తో ప్రచారం చేసుకుంది. ఇక, ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని రోజుల ముందు టీడీపీ-జనసేన పార్టీలు బీజేపీతో పొత్తును ఖరారు చేసుకున్నాయి. ఇక, తొలి రెండు వారాలు మందకొడిగా సాగిన ప్రాచారం.. ఏప్రిల్ తొలి వారం చివరి నుంచి మాత్రం పుంజుకుంది. వైసీపీ ఏకంగా.. భారీ ప్రచార సభలు నిర్వహించింది. అదేవిధంగా 22 రోజుల పాటు సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు.
ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. ఉమ్మడిగా చిలకలూరిపేట, రాజమండ్రి, అనకాపల్లి, పీలేరు వంటి ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించగా.. విజయవాడలో ఫినిషింగ్ టచ్ అన్నట్టుగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఆయా సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, మరో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి వారు పాల్గొన్నారు. ఇక, నందమూరి బాలకృష్ణ తన నియోజ కవర్గంతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా స్వర్ణాధ్ర సాకార యాత్రను చేపట్టారు. నందమూరి వసుంధర, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా.. ప్రజల్లో తిరుగుతున్నారు. ఇటు వైపు కాంగ్రెస్‌లోనూ జోష్ పెరిగేలా.. గత 22 రోజులుగా ఆ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల ప్రచారాన్ని దంచికొడుతున్నారు.
సోషల్ మీడియాలో రీల్స్, వాయిస్, వీడియోలు.. అదనపు ఆకర్షణకాగా.. డిబేట్లు, ఇంటర్వ్యూలు.. వంటివాటితో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున హైప్ పెంచేశాయి. ఎన్నికల్లో గెలుపు ధీమాతో అన్ని పార్టీలు ఉండడం గమనార్హం. ఇక, శనివారం సాయంత్రంతో ఈ ప్రచారానికి బ్రేకులు పడనుండగా.. టీడీపీ మరింత దూకుడు పెంచింది. శుక్రవారం, శనివారం రెండు రోజులు చంద్రబాబు రోజుకు 5 చోట్ల ప్రజాగళం సభలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. వైసీపీ కూడా ఇదే రేంజ్‌లో ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఇక, జనసేన అధినేత, పిఠాపురం అభ్యర్థి పవన్ కల్యాణ్ కోసం మెగా కుటుంబం ఏదో ఒక రూపంలో ప్రచారం అయితే చేయడం గమనార్హం. మొత్తంగా సోమవారం ప్రజల తీర్పు కోసం పార్టీలు.. వేచి చూస్తున్నాయి.