ఇంటింటికీ వెళ్లి ప్రచారమా... ఈసీ తాజా ప్రవర్తనా నియమావళి ఇదే!
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఏపీలో రాజకీయ పార్టీలు ప్రచారాలకు తెరలేపాయి
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఏపీలో రాజకీయ పార్టీలు ప్రచారాలకు తెరలేపాయి. ఈ క్రమంలో మూడు పార్టీల అధ్యక్షులూ యాత్రలకు ముహూర్తాలు ఫిక్స చేశారు. ఈ నెల 27 నుంచి జగన్ “బస్సు యాత్ర”, చంద్రబాబు “ప్రజాగళం”, ఈ నెల 30 నుంచి పవన్ “వారాహి యాత్ర”లకు ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయాయి! ఈ సమయంలో ఎన్నికల కమిషన్ తాజాగా ప్రవర్తనా నియమావళిని విడుదల చేస్తూ మరికొన్ని షాక్ లు ఇచ్చింది! దీంతో... ఇంటింటికీ వెళ్లి చేసే ప్రచారమూ హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ప్రవర్తనా నియమావళిని నిర్దేశిస్తూ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా లేఖలు రాశారు. ఈ లేఖలో పలు షాకులు తెరపైకి వచ్చాయి. ఇవన్నీ తప్పనిసరిగా అమలుచేయాలని తేల్చి చెప్పేశారు. ఇక ఏమాత్రం పాటించకపోయినా చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు! ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన కొత్త రూల్స్ కొంతమందికి భారీ షాకిచ్చేవిగా ఉన్నాయనే భావించాలి!
ఇందులో భాగంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకున్నా కూడా ఈసీ అనుమతి తప్పనిసరి అని ఈసీవో ముఖేష్ కుమార్ మీనా తాజా లేఖలో స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకునే నేతలు.. స్థానిక రిటర్నింగ్ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచారం నిమిత్తం ఓటర్ల ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో సభలు, సమావేశాల విషయంలోనూ కీలక సూచనలు చేశారు.
ఈ నేపథ్యంలో... సభలూ, సమావేశాలు పెట్టుకోవాలన్న.. ఆఖరికి కరపత్రాలు పంచాలన్నా కూడా సువిధ యాప్ లో అనుమతి తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించేవారు, కీలక నేతలు తమ తమ ప్రచార వాహనాల అనుమతులను స్థానికంగా కాకుండా.. సీఈఓ స్థాయిలోనే అనుమతులు తీసుకోవాలని.. అదేవిధంగా.. తమ తమ ప్రచార సామాగ్రికి అనుమతులు కూడా సీఈవో వద్దే తీసుకోవాలని తెలిపారు.
ఇక ప్రధానంగా సభలు పెట్టుకోవాలన్నీ, ర్యాలీలు చేపట్టాలన్నా కనీసం 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలని.. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచీ ఎలాంటి ప్రచారలకూ అనుమతులు ఉండవని.. తెలిపారు. ఇదే సమయంలో... పోలింగ్ తేదీ రోజున నియోజకవర్గంలో తిరిగేందుకు అసెంబ్లీ అభ్యర్థితో పాటు వారి పోలింగ్ ఏజెంట్ కు కలిపి రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపిన ఈసీ... లోక్ సభ అభ్యర్థులకు మరో వాహనం అనుమతిస్తామని తెలిపారు.