అభ్యర్థుల మెడికల్ టెస్టు రిపోర్టులపై ఈసీ కీలక వివరణ
అభ్యర్థుల ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదిక వారి వ్యక్తిగత అంశమని.. వాటిని అడగటం కుదదరని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో తమ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను కూడా జత చేయాలన్న వాదనపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. దీనికి సంబంధించిన పిటిషన్ ఒకటి మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై ఎన్నికల సంఘం వివరణ కోరిన న్యాయస్థానానికి తమ వాదనల్ని వినిపించింది. నామిషేన్ సమయంలో అభ్యర్థుల ఆస్తులు.. వారిపై ఉన్న కేసుల వివరాలతో పాటు 30 రోజులకు ముందు చేసిన వైద్య పరీక్షల నివేదికను కూడా జత చేయాలన్న పేరుతో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒకటి మద్రాస్ హైకోర్టు ముందు విచారణకు వచ్చింది.
దీనిపై ఎన్నికల కమిషన్ వివరణ కోరగా ఈసీ స్పందించింది. అలాంటివి చేయాలంటే అందుకు అనుగుణంగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని మద్రాస్ హైకోర్టును వివరణ ఇచ్చింది. కోయంబత్తూరుకు చెందిన ఎస్వీ సబ్బయ్య అనే వ్యక్తి ఈ అంశంపై 2016లో పిటిషన్ దాఖలు చేవారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ గంగాపూర్వాలా.. జస్టిస్ భరత చక్రవర్తిల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
అభ్యర్థుల ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదిక వారి వ్యక్తిగత అంశమని.. వాటిని అడగటం కుదదరని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది విధానపరమైన నిర్ణయమని.. అలా జరగాలంటే చట్ట సవరణ చేపట్టాలని పేర్కొంది. అభ్యర్థుల ఆరోగ్య సమస్యల గురించి తెలియజేయాలని బలవంతం చేయటం కుదరదని తెలిపిన న్యాయమూర్తులు తదుపరి విచారణకు కేసును వాయిదా వేశారు. అభ్యర్థుల ఆరోగ్య సమస్యల వివరాలు నామినేషన్ తో పాటు వస్తే.. తమకు సేవ చేయాలనుకునే నేత శక్తిసామర్థ్యాలు.. ఆరోగ్య పరిమితులు కూడా తెలిసే వీలుందన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు.