ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కి ముహూర్తం ఫిక్స్ ....?

లోక్ సభ ఎన్నికలతో ఏపీ ఎన్నికలు ముడిపడి ఉండడంతో గడువు కంటే రెండు నెలల ముందుగానే ఎన్నికల నగారా ఏపీలో మోగనుంది అని అంటున్నారు.

Update: 2023-10-29 04:00 GMT

ఏపీలో ఎన్నికలు ఎపుడు అంటే ఇంకా అయిదారు నెలలు ఉంది అని అంతా అంటారు. కానీ చూస్తూండగానే ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఏపీ ఎన్నికల సంఘం ఆ దిశగా చేయాల్సిన కసరత్తు అంతా చేస్తోంది. ఇప్పటికే 2023 ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. దీని మీద అభ్యంతరాలకు కూడా గడువు ఇచ్చింది. ఇక కొత్త ఏడాది జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.

ఇదిలా ఉంటే మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అంటున్నారు దీన్ని బట్టి చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది అని భావించాలి.

ఎటూ అక్టోబర్ నెల పూర్తి అవుతోంది. 2023 క్యాలెండర్ లో ఇక మిగిలేది కేవలం రెండు నెలలు మాత్రమే. 2024 జనవరి ఫిబ్రవరి మరో రెండు నెలలు ఉంటాయి. మార్చిలో నోటిఫికేషన్ అంటే అది ఆ నెల మధ్యలో ఎపుడు వచ్చినా రావచ్చు అని అంచనా వేస్తున్నారు. 2019లో మార్చి 11న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.

ఆ మీదట నెల రోజులకు ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు రావడానికి అప్పట్లో మే నెల 23 దాకా పట్టింది. ఎందుకంటే లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగడం. దాంతో ఈసారి కూడా అదే విధంగా దశల వారీగా ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. 2019లో జరిగినట్లుగానే తొలి విడతలోనే ఏపీ ఎన్నికలు పూర్తి చేస్తారని తెలుస్తోంది.

అందువల్లనే ఏపీ ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున కసరత్తుని మొదలెట్టింది అని అంటున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వస్తాయి. ఆ తరువాత ఇక దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ వంటి గడువు తీరిన రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తుంది అని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికలతో ఏపీ ఎన్నికలు ముడిపడి ఉండడంతో గడువు కంటే రెండు నెలల ముందుగానే ఎన్నికల నగారా ఏపీలో మోగనుంది అని అంటున్నారు. అలా కాకుండా ఒక్క అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు అంటే మాత్రం మే నెల చివరిలో ఎన్నికలు పెట్టేవారు. దాంతో జమిలి ఎన్నికల పుణ్యమా అని ఏపీ రెండు నెలల ముందే కేవలం అపద్ధర్మ ప్రభుత్వంగా మారిపోతుంది అని అంటున్నారు. ఇది చంద్రబాబుకూ జరిగింది.

ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికలకు సంబంధించి మార్చిలో నోటిఫికేషన్ కి అవకాశం ఉండవచ్చు అని ముఖేష్ కుమార్ చేసిన ప్రకటనతో ఏపీలోని రాజకీయ పార్టీలు అలెర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే జనంలోకి వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో వెళ్తోంది. టీడీపీ కూడా నిరసనలు ఆందోళనలు చేస్తోంది. తెలంగాణా ఎన్నికల ఫలితాను చూసుకుని ఏపీలో ఎన్నిక వేడి రాజేయడానికి విపక్షాలు రెడీగా ఉన్నాయి. మొత్తానికి చూస్తే ఏపీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనే అంటున్నారు.

Tags:    

Similar News