ట్రంప్‌పై హత్యాయత్నంపై మస్క్ సంచలన ట్వీట్

స్పేస్ ఎక్స్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు.

Update: 2024-09-16 06:18 GMT

స్పేస్ ఎక్స్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఒక్కసారిగా చర్చకు దారితీసింది. ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏమన్నారంటే..

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆయన గోల్ఫ్ కోర్టులో ఉండగా ఎవరో దుండగుడు తుపాకీతో అనుమానాస్పదంగా సంచరించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆ దుండగుడిపై కాల్పులు జరిపారు. అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఈ ఘటనపై స్పందించిన ఎలాన్ మస్క్ ఈ సంచలన ట్వీట్ చేశారు.

‘మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పైనే ఎప్పుడూ మర్డర్ అటెంప్ట్ జరుగుతోంది. కానీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దానికి ఒక ఏమోజీని యాడ్ చేసి పోస్ట్ చేశారు. అటు అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కమలాహారిస్ పైనా ఎవరూ కాల్పులు జరపడం లేదని సందేహం వ్యక్తం చేశారు.

ట్రంప్‌ను ఎందుకు చంపాలని అనుకుంటున్నారని.. ఓ యూజర్ పోస్ట్ చేయడంతో దానిని రీట్వీట్ చేస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రంప్‌కు మస్క్ ముందు నుంచి మద్దతు తెలుపుతున్నారు. ఆయన గెలుపు కోసం భారీ ఎత్తున విరాళాలు సైతం అందించారు. ఇటీవల ఆయనతో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ సైతం చేశారు. ఇంటర్వ్యూ ప్రసారం అయ్యే సమయంలోనే సైబర్ దాడి జరిగింది. దాంతో అది ప్రజల్లోకి వెళ్లలేకపోయింది.

మరోవైపు.. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ట్రంప్ మరోసారి క్షేమంగా బయటపడ్డారని, ఆయనకు బైడెన్‌కు కల్పిస్తున్న అత్యున్నత స్థాయి భద్రతను కల్పించాలని కోరారు.

Tags:    

Similar News