మస్క్ మజాకా.. అమెరికా ఆ రాష్ట్రం దివాలా?
ఈ కేసును విచారించిన డెలావర్ స్థానిక కోర్టు.. ఇంత భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలాన్ మస్క్ అనర్హుడంటూ తీర్పు చెప్పింది. ఇది మస్క్‌కు నచ్చలేదు.
ఎలాన్ మస్క్.. ట్విట్టర్.. ప్రస్తుతం 'ఎక్స్' అధినేత. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా కంపెనీ దిగ్గజం.. తర్వాత.. దీనిని మరింత పకడ్బందీగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో వ్యాపార వస్తువుగానూ మార్చారు. ఇక, ఆయన తనదైన శైలిలో తీసుకునే నిర్ణయాలు.. చేసే కామెంట్లతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా ఆయన అమెరికాలోని ఓ స్టేట్(ప్రావిన్స్)ను గడగడ లాడిస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం.. ఇచ్చిన పిలుపును పాటించేందుకు దిగ్గజ కంపెనీలు కూడా రెడీ అయ్యాయని సమాచారం. దీంతో ఈ రాష్ట్రం నుంచి ఆయా కంపెనీలు తరలిపోనున్నాయి. ఇదే జరిగితే.. ఈ స్టేట్ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుం దని అంటున్నారు.
ఏం జరిగింది.
టెస్లా అధినేత మస్క్.. తన కంపెనీలను ఎక్కువగా.. అమెరికాలోని డెలావర్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారు. దీనికి కారణం.. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విధించే స్థానిక పన్నులు తక్కువగా ఉంటాయి. సెస్సులు కూడా ఉండవు. దీంతో ఒక్క మస్క్ మాత్రమే కాదు.. అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు కూడా ప్రధాన కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాయి. అయితే.. 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్ తన వేతనాన్ని 2018లో సవరించుకున్నారు. 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు)కు పెంచుకున్నారు. దీనిని టెస్లా బోర్డు డైరెక్టర్‌లు కూడా మెజారిటీ సంఖ్యలో ఆమోదం తెలిపారు. కానీ, టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా వ్యతిరేకిస్తూ.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ కేసును విచారించిన డెలావర్ స్థానిక కోర్టు.. ఇంత భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలాన్ మస్క్ అనర్హుడంటూ తీర్పు చెప్పింది. ఇది మస్క్‌కు నచ్చలేదు. అంతే.. ఉన్నపళంగా ఆయన తన ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి జెండా పీకేశారు. డెలావర్ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఈ రాష్ట్రం(డెలావర్)లో ఎవరూ తమ సంస్థలను రిజిస్టర్ చేసుకోవద్దని పిలుపునిచ్చారు. టెస్లా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు మార్చాలా? అని పోల్ కూడా పెట్టారు. దీనికి కోర్టు తీర్పును జత చేశారు. అంతే.. మెజారిటీ సంఖ్యలో 'ఎస్' అంటూ సానుకూలంగా స్పందించారు.
ఆ వెంటనే మస్క్ తన కార్యాలయాన్ని తరలించేందుకు ఏర్పాటు చేసేశారు. ఈ క్రమంలో రాష్ట్రం వీడిపోతున్నందుకు ఉద్యోగులకు భారీగా నగదు కూడా ఇచ్చారు. ఇది ప్రయాణ ఖర్చులకని చెప్పారు. ఇదిలావుంటే.. మస్క్ నిర్ణయంతో అమెజాన్, ఫ్లిప్ కార్టు సంస్థలు కూడా ఆలోచనలో పడ్డాయి. దీంతో అవి కూడా.. తరలి పోయేందుకు తాము కూడా పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నాయి. ఇదే జరిగితే.. కేవలం పన్నులపైనే ఆధారపడి ఉన్న డెలావర్ రాష్ట్రానికి పెద్ద దెబ్బేనని అంటున్నారు ఆర్థిక నిపుణులు.