తమ్ముళ్ళిద్ద్దరూ కొట్టుకుంటే ఆ సీటు జనసేనకే....?

టీడీపీలో తమ్ముళ్ల మధ్య విపరీతమైన గొడవలు, వర్గ పోరు ఉన్న చోట్ల ఆ సీటుని కాస్తా పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది.

Update: 2023-09-06 00:30 GMT

పిట్ట పోరు పిల్లి తీర్చింది అని ఒక ముతక సామెత ఉంది. అలా టీడీపీలో తమ్ముళ్ల మధ్య విపరీతమైన గొడవలు, వర్గ పోరు ఉన్న చోట్ల ఆ సీటుని కాస్తా పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. అలా కాంప్లికేటెడ్ సీట్ల విషయంలో టీడీపీ ఈ తరుణోపాయం కనుగొంటోంది అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలోని ప్రవేశించడానికి ముందే ఎచ్చెర్ల తగులుతుంది. అది శ్రీకాకుళం కంటే కూడా ఇపుడు అభివృద్ధిలో ముందు ఉంటోంది. ఒక వైపు విద్యా రంగం అభివృద్ధి చెందుతోంది. పారిశ్రామికంగా ప్రగతిపధంలో నడుస్తోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. దాంతో ఎచ్చెర్లలో రాజకీయం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.

అంతే కాదు అధికార పార్టీలో ఎమ్మెల్యే అంటే మరీ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. అలా ఆనందం అంతా వైసీపీ సిట్టింగ్ ఎమ్మీల్యే గొర్లె కిరణ్ కుమార్ అనుభవిస్తున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసుకుంటే టీడీపీ కూడా 2014 నుంచి 2019 దాకా ఇక్కడ గెలిచి అధికారంలో ఉంది. సీనియర్ లీడర్ కిమిడి కళా వెంకటరావు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు.

అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో ఆయన ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆయన ఈ సీటు నుంచి తాను కానీ తన కుమారుడు కానీ పోటీ చేయాలని చూస్తున్నారు. తన కుమారుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడుకు ఈ టికెట్ ని కన్ ఫర్మ్ చేయించుకోవాలని ఆరాటపడుతున్నారు. అలా అయితే తన రాజకీయ జీవితానికి విశ్రాంతిని ప్రకటించాలని చూస్తున్నారు.

అయితే కళా తన కుమారుడిని సీన్ లోకి తీసుకుని రావడంతో టీడీపీలో ఇతర నేతలకు కూడా ఆశపుట్టింది. ఉత్తరాంధ్రా టీడీపీ శ్రేణులకు నిర్వహించే శిక్షణా శిబిరాలలో మాస్టర్ గా ఉంటూ చంద్రబాబు మన్ననలు అందుకున్న నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు ఈ సీటు మీద మోజు పెంచుకున్నారు. ఆయన కూడా బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఈసారి కొత్త ముఖం, మంచి నేత అని ఆయనకు టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అయితే సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న కళా వెంకటరావు ఎక్కడా తగ్గడంలేదు. తన ఫ్యామిలీకే ఎచ్చెర్ల టికెట్ ఇవ్వాలని ఆయన గట్టిగాగనే పట్టుపడుతున్నారు. ఈ నేపధ్యంలో కళా కలిశెట్టి వర్గాల మధ్య భీకర పోరు సాగుతోంది. అది ఎంతలా వెళ్ళింది అంటే పార్టీ ఇచ్చిన ఒకే కార్యక్రమాన్ని రెండు వర్గాలుగా వేరు వేరుగా నిర్వహించేటంతగా. ఇక కళా వెంకటరావుకు నియోజకవర్గంలో పట్టుంది. ఆయనను కాదంటే ఎంతవరకూ సహకరిస్తారో లేదో తెలియదు. ఇక కలిశెట్టికి మంచి పేరు బలగం ఉన్నాయి.

ఆయనకు నో చెప్పినా అదే సీన్ అని అంటున్నారు. దాంతో మధ్యేమార్గంగా ఈ సీటుని జనసేనకు ఇస్తారని ప్రచారం అయితే ఊపందుకుంటోంది. ఈ సీటు విషయంలో ఇప్పటికే జనసేన కూడా ఆశలు పెట్టుకుని పనిచేస్తోంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆ మధ్యన యువ భేరీ పేరుతో ఎచ్చెర్లలోనే మీటింగ్ పెట్టారు. ఎచ్చెర్ల సీటు మీద కన్నేసి అలా మీటింగ్ పెట్టారని అంటున్నారు.

మొత్తానికి జనసేనకు ఎచ్చెర్ల టికెట్ పొత్తులో వెళ్లిపోతే మాత్రం తమ్ముళ్లు నోరు వెళ్లబెట్టాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే పార్టీని దాటి ఒకసారి సీటు వెరే వారికి వెళ్ళిందంటే అక్కడ పునాదులు కదులుతాయని క్యాడర్ అంటోంది. కానీ వర్గ పోరు వల్లనే ఇలా చేయాల్సి వస్తోంది అన్న మాట కూడా ఉంది. మొత్తానికి జనసేనకు శ్రీకాకుళంలో ఒకటో రెండో సీట్లు ఇవ్వాలని అంటున్నారు. అలా పొత్తు కాస్తా ఈ వైపుగా వచ్చి ఎచ్చెర్ల మీద పడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News