ఆ సీటు ఈటలకు అంత ఈజీ కాదు!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలంటే వీలైనన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీకి అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకొని రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. మరికొన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో నిలబడటానికి ఆ పార్టీ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీకి పట్టున్న నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజిగిరి స్థానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయొచ్చని చెబుతున్నారు.
అయితే ఈటల రాజేందర్ కు ఈ సీటు అంత ఈజీ కాదని అంటున్నారు. ఇప్పటికే ఈ సీటును బీజేపీ తరఫున కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి మురళీధర్ రావు ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా మల్కాజిగిరి సీటుకు బీజేపీ తరఫున మురళీధర్ రావు పేరే వినిపిస్తోంది. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు, బీజేపీ అధిష్టానంతో ఉన్న సంబంధాలు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండటం, తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం తదితర కారణాలతో ఆయనకే సీటు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.
మల్కాజిగిరి నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఇటీవల అగ్రనేతలను కలిసి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. గతంలో తాను మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా, పార్లమెంట్ ఇంచార్జిగా వ్యవహరించానని, బీసీ ఓట్లు గణనీయంగా ఉండడంతో టికెటిస్తే ఈజీగా గెలుస్తానని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పోటీకి వీలుగా అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
శ్రీశైలం గౌడ్ ఇటీవల కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 1,02,423 ఓట్లు రావడం గమనార్హం. మరోవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు 3,04,282 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో ఈటల రాజేందర్ కు సీటు ఇవ్వనట్టేనని అంటున్నారు.
కాగా మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి ప్రస్తుతం ఎంపీగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉండటంతో గట్టి అభ్యర్థిని నిలిపే ప్రయత్నాల్లో ఉన్నారు.