లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు: సీఎం రేవంత్
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.
గత బీఆర్ ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేదని విమర్శించారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లను, ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.
అనంతరం.. సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు రూపాయలు ఖర్చుపెట్టినా.. కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని ఆరోపించారు. కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినా.. పట్టించుకోలేదన్నారు. ``ప్రాజెక్టు ద్వారా సాగునీరు వచ్చిందో లేదో కానీ, ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయి`` అని వ్యాఖ్యానించారు.
తొలుత మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన 21వ పిల్లర్, ప్రాజెక్టును రేవంత్ టీమ్ పరిశీలించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు కాళేశ్వరం ప్రాజెక్టుతో తేలిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ స్థాయిలో వైఫల్యం కనిపిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్ గత బీఆర్ ఎస్ సర్కారుపై మండిపడ్డారు. నీళ్లను అడ్డు పెట్టుకుని బాగా మేశారని వ్యాఖ్యానించారు. లేకపోతే.. ఇంత పెద్ద ఎత్తున మేడిగడ్డ కుంగిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి రూపాయి ప్రజల నుంచి తీసుకున్నదేనని.. దీనికి జవాబు దారీ తనం అవసరం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. దీనిపై సభలో ప్రశ్నిస్తే.. మాపై ఎదురు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ, సమస్యలను అంగీకరించే మనస్తత్వం వారికి లేదని విమర్శలు గుప్పించారు.