అందరి చూపూ నితీష్ మీదేనా ?

రూపాలి అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగితే ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.

Update: 2024-07-13 17:42 GMT

ఉత్తరాన కొత్త మార్పు రాజకీయంగా కనిపిస్తోంది. అది లోక్ సభ ఎన్నికల్లో ప్రస్పుటం అయింది. అది నికరం కాదు అనుకుంటే తాజాగా వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలతోనూ మరోమారు రుజువు అయింది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటుని మాత్రమే ఎన్డీయే గెలుచుకోవడం మిగిలిన 12 ఇండియా కూటమి పరం కావడం అంటే మూడోసారి ఏర్పాటు అయిన మోడీ సర్కార్ కి ఆదిలోనే హంస పాదు లాంటి పరిణామం అని అంటున్నారు.

బీహార్ లో చూసుకున్నా ఎన్డీయే ఓటమి పాలు అయింది. అక్కడ జేడీయూతో బీజేపీ ఘట్ బంధన్ కొనసాగుతోంది. రూపాలి అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగితే ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. అంటే ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగానే జనాలు అక్కడ ఓటేశారు అని అర్ధం అవుతోంది అంటున్నారు. 2025 నవంబర్ లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్ధి ఓటమి పాలు కావడం అంటే ఎదురుగాలి వీస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు. బీహార్ లోని రూపాలి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో జేడీయూకి చెందిన కళాధర్ ప్రసాద్ మండల్ ని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ సింగ్ ఎనిమిది వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓడించారు.

ఇక్కడ ఆర్జేడీ అభ్యర్ధిగా బీమా భారతి పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. నిజానికి ఆమె రూపాలీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతే కాదు బీమా భారతి ఆమె అనేకసార్లు జెడియు తరఫున ఇదే సీటు నుంచి గెలిచారు. గెలుపొందారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూని విడిచిపెట్టి ఆర్‌జెడి టిక్కెట్‌పై పార్లమెంటు రేసులో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆమెనే తిరిగి ఆర్జేడీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీకి లాలూ పార్టీ దించింది.

ఇక జేడీయూ నుంచి కళాధర్ ప్రసాద్ మండల్ పోటీ చేయగా ఇండిపెండెంట్ ఈ సీటుని కొట్టుకుని పోయారు. ఇక్కడ జేడీయూకే నష్టం జరిగింది అని చెప్పాలి. బలమైన సీటులో ఉప ఎన్నిక జరిగితే పోయింది. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే జేడీయూకు చెందిన వారు. దాంతో ఈ సీటుని నిలబెట్టుకో లేకపోవడం అంటే బీహార్ లో రాజకీయ మార్పునకు ఇది నిదర్శనమా అన్న చర్చ సాగుతోంది.

ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న క్రమంలో ఈ ఉప ఎన్నిక ఫలితం జేడీయూ బీజేపీ కూటమికి ఇబ్బందికరమే అని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి బలంగా గాలి వీచడం కూడా గమనించాల్సి ఉంది. మరి రాజకీయంగా ఉద్దండుడు అయిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ పరిణామాలను భవిష్యత్తులో జరిగే రాజకీయ మార్పులను అంచనా వేయకుండా ఉంటారా అన్నదే చర్చ.

ఇప్పటికే ఆయన ప్రత్యేక హోదా బీహార్ కి ఇవ్వాలీ అని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇపుడు జాతీయ స్థాయిలో గాలి మార్పుని చూసిన మీదట ఆయన తన స్వరాన్ని మరింతగా పెంచవచ్చు అని అంటున్నారు. అది కేంద్రంలో ఎన్డీయేని నడుపుతున్న పెద్దలకు ఇరకాటమే అని అంటున్నారు.

మరో వైపు ఇండియా కూటమి నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. మోడీ సర్కార్ అస్థిరంగా ఉందని ఈ ఫలితాలతో మరింతగా డీలా పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు నితీష్ కుమార్ రాజకీయంగా ఏమైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది.

అయితే మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకూ ఆగి ఆయన ఆ ఫలితాలను చూసిన మీదటనే తన వ్యూహాలకు పదును పెట్టవచ్చు అన్నది మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా 2025 నవంబర్ తరువాత జాతీయ స్థాయిలో కీలకమైన సంచలనమైన మార్పులు సంభవించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా ఎన్డీయే పాలకులకు ఇది గడ్డు పరిస్థితులే అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News