టీడీపీకి కేంద్ర మాజీమంత్రి రాజీనామా... కారణం క్లియర్!
ఇందులో కాంగ్రెస్ – కామ్రెడ్స్ ఆల్ మోస్ట్ ఓకే అని అంటున్న నేపథ్యంలో... టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ చేరికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో తాను ఒంటరిగానే పోటీ చేస్తానని వైసీపీ అధినేత జగన్ చెబుతుండగా... ఏపీలో ఇప్పుడు మూడు రకాల పొత్తుల టాపిక్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా టీడీపీ - జనసేన... టీడీపీ - జనసేన - బీజేపీ... కాంగ్రెస్ – కామ్రెడ్స్ పొత్తుల చర్చలు నడుస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ – కామ్రెడ్స్ ఆల్ మోస్ట్ ఓకే అని అంటున్న నేపథ్యంలో... టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ చేరికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు... అమిత్ షాతో భేటీ అయ్యి చర్చలు జరిపినట్లు కథనాలొచ్చినప్పటికీ... ఈ విషయంపై టీడీపీ నుంచి ఎటువంటి రియాక్షన్ బయటకు రావడం లేదు. ఈ సమయంలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా... బీజేపీతో పొత్తుపై టీడీపీ చర్చలు జరపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర మాజీమంత్రి రాజీనామా చేశారని తెలుస్తుంది. దీంతో... ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ చర్చలు జరపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా... విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయం అని చంద్రదేవ్ తెలిపారు!!
ఇదే సమయంలో... అధికారం కోసం ఆత్మను అమ్ముకోలేనంటూ ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు! గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఓటమి పాలైన కిషోర్ చంద్రదేవ్.. ఎన్నికల అనంతరం హస్తినకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో... బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు!
కాగా... బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు అంశంపై చర్చలు జరుగుతున్నాయంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ కీలక నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఓ దఫా చర్చలు జరిపారు! అయితే, ఆ సమయంలో వారి మధ్య ఏయే అంశాలపై చర్చలు జరిగాయనే విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మరోవైపు ఎన్డీయేలో టీడీపీ చేరికపై చంద్రబాబు చర్చించినట్లు కథనాలొస్తున్నాయి!!