వైసీపీలో నయా ట్రెండ్ : ఫ్యామిలీస్ లోనే వార్ ?

ఎన్నడూ లేని నయా ట్రెండ్ ఈసారి ఎన్నికల్లో కనిపిస్తోంది. అదేంటి అంటే ఒక రాజకీయ నాయకుడి మీద ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు.

Update: 2024-05-08 11:30 GMT

ఎన్నడూ లేని నయా ట్రెండ్ ఈసారి ఎన్నికల్లో కనిపిస్తోంది. అదేంటి అంటే ఒక రాజకీయ నాయకుడి మీద ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు. దానికి వారు ధీటుగా జవాబు చెబుతారు. కానీ సొంత పార్టీ వారే విమర్శలు చేస్తే అది కూడా మరో ట్రెండ్. ఇపుడు వాటిని కూడా దాటేసి సొంత కుటుంబ సభ్యులే విమర్శలు చేయడం ఎదురుగా నిలవడం, ప్రత్యర్ధుల కంటే దారుణంగా విమర్శించడం ఇవన్నీ ఈసారి ఎన్నికలలోనే కనిపిస్తున్నాయి. 2024 ఎలక్షన్ స్పెషల్ ఏంటి అంటే ఇదే అని ఘంటాపథంగా చెప్పుకోవాల్సి ఉంది అని అంటున్నారు.

ముందుగా ఏపీని ఏలే సీఎం, అలాగే వైసీపీ అధినేత జగన్ విషయం తీసుకుంటే మొదట ఆయనకే ఇంటి పోరు మొదలైంది. జగన్ కి 2014, 2019లలో వెన్నుదన్నుగా ఉంటూ వచ్చిన సొంత చెల్లెలు షర్మిల ఈసారి ఎన్నికల్లో ఎదురు నిలిచింది. ఆమె ఏకంగా జగన్ ని టార్గెట్ చేస్తూ గత నాలుగు నెలలుగా ఏపీ రాజకీయ తెర మీద తనదైన దూకుడు రాజకీయం చేస్తున్నారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీని ఆమె గుక్క తిప్పుకోనీయడంలేదు. ఆమె కూడా వైఎస్సార్ బిడ్డ. ఆమె సైతం వైసీపీలో మొదటి నుంచి ఉన్న వారు. ఆ పార్టీ విజయాలలో భాగం అయిన వారు. ఇపుడు ఆమె బయటకు వెళ్ళి జగన్ మీద ఆయన పాలన మీద విమర్శలు చేస్తూ జగన్ గద్దె దిగాల్సిందే అని చేస్తున్న డిమాండ్లు కచ్చితంగా ఏపీ జనాలకు సరికొత్త అనుభవాన్ని ఇస్తున్నాయి. అంతే కాదు ఆమె చెప్పే మాటలు చేసే విమర్శలు ఇంతకాలం ప్రత్యర్ధులు చేసే విమర్శలతో పోలిస్తే వాడిగా వేడిగా ఉంటున్నాయి.

పైగా ఆమె సొంత వారే కావడంతో ఆమె చేసే విమర్శలకు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటుందని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే వైఎస్సార్ కుటుంబానికి పెట్టని కోట అయిన కడప జిల్లాలో అన్నా చెల్లెలు తొలిసారి రాజకీయ ప్రత్యర్ధులుగా మారి పోటీ చేయడం. కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీలో ఉంటే పులివెందుల నుంచి జగన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ నుంచి ఆయన పోటీలో ఉంటే కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు.

ఈ రకమైన రాజకీయంతో ఏపీ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా వేడెక్కాయి. ఇక కేవలం జగన్ కి మాత్రమే ఈ ఇంటిపోరు పరిమితం కాలేదు. వైసీపీలో వరసబెట్టి చాలా మంది కీలక నేతలకు ఆ విధమైన పోరు ఉంది. వారు బయట ప్రత్యర్థులతో కంటే ఇంట్లో ఉన్న వారితోనే పోరు సలపడానికి సమయం సరిపోవడం లేదు అని అంటున్నారు.

మంత్రి అంబటి రాంబాబుకు ఏకంగా సొంత అల్లుడు నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. మా మామకు ఈసారి ఓటేయొద్దు అని అల్లుడే వీడియోలు చేసి వదులుతూంటే అంబటి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సిందే కదా. మీరు అనుకున్నట్లుగా మంచి వారు కాదు మా మామగారు అని అల్లుడే తనదైన స్టైల్ లో సర్టిఫికేట్ ఇస్తూంటే జనాలకు ఇది సరికొత్త చోద్యంగా అనిపించడంలో తప్పు లేదు. వారు ఎక్కువ శాతం నమ్మేందుకు కూడా వీలు ఉంటుందని కూడా అంటున్నారు.

అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో ఉన్నారు. ఆయన కుమార్తె క్రాంతి జనసేనకు జై కొట్టి తన తండ్రి వైసీపీలో ఉండడాన్ని తప్పుపట్టారు. ఆయన పేరుని అవసరాలకు తగినట్లుగా వైసీపీ వాడుకుంటోంది అని క్రాంతి చేసిన విమర్శలు కూడా జనంలో చర్చకు వస్తున్నాయి. సొంత కుమార్తెని కన్వీన్స్ చేయలేక ముద్రగడ ఇరకాటంలో ఉన్నారా అన్న చర్చ కూడా మొదలవుతోంది.

అంతే కాదు ఉత్తరాంధ్రా జిల్లాలకు వస్తే కనుక శ్రీకాకుళం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ కి సొంత భార్య నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దువ్వాడ వాణి ఏకంగా భర్తకే ప్రత్యర్ధిగా మారారు. ఆయనని గెలిపించ వద్దు అని ఆమె అంటున్నారు. ఒక దశలో ఆమె వైసీపీ తరఫున రెబెల్ గా నామినేషన్ దాఖలు చేసారు. అయితే ఆమెని సర్దిచెప్పి ఒప్పించారు కానీ ఆమె వర్గం మాత్రం దువ్వాడ గెలుపునకు ఏ మాత్రం సహకరించడం లేదు. దాంతో దువ్వాడ తలపట్టుకునే పరిస్థితి ఉంది.

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బూడి ముత్యాలనాయుడుకు కొడుకుతోనే పోరు ఎదురైంది. బూడి రవి ఏకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ తన తండ్రిని ఓడించాలని పిలుపు ఇస్తున్నారు. కొడుకునే చూడలేని తండ్రి ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు అని బూడి రవి పెడుతున్న స్ట్రాంగ్ మెసేజిలతో బూడి ముత్యాలనాయుడుకు సన్ స్ట్రోక్ గట్టిగా తగులుతోంది. అంతటితో ఆగని బూడి రవి ఏకంగా ఇండిపెండెంట్ గా మాడుగుల నుంచి పోటీ చేయడం కూడా వైసీపీని కలవరపెడుతోంది.

ఇవన్నీ చూస్తున్న వారు అంతా అదేదో సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఒక డైలాగ్ ని వల్లె వేస్తున్నారు. శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనె మన పక్కనే వారు తిరుగుతూ ఉంటారు అని. ఆ డైలాగునే ఇపుడు వైసీపీ నేతలు అంతా తలచుకుంటున్నారుట. మొత్తానికి ప్రత్యర్ధులకు ఎలాంటి అయాసం లేకుండా కీలక వైసీపీ నేతల విషయంలో కాగల కార్యాన్ని సొంత వారు రక్తం పంచుకుని పుట్టిన వారే పూర్తి చేస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News