6 రోజులు 70 విమానాలకు బెదిరింపులు... బీసీఏఎస్ కీలక నిర్ణయం!

గత కొన్ని రోజులుగా భారత్ కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-20 13:58 GMT

గత కొన్ని రోజులుగా భారత్ కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపుల ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతోంది. ఈ విషయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అనే తారతమ్యాలేమీ లేవు అన్నట్లుగా అన్నిరకాల ఎయిర్ లైన్స్ కు బెదిరింపులు వస్తున్నాయి.

అవును... భారత్ కు చెందిన విమానాలకు వరుసగా వస్తోన్న బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే విమానాలతో పాటు విదేశాలకు వెళ్తోన్న ఎయిర్ లైన్స్ కు బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.

ఇందులో ఒక్క శనివారమే సుమారు 10కి పైగా వేర్వేరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయని చెబుతున్నారు. ఇందులో ఇండిగో విమానాలే ఆరు వరకూ ఉండటం గమనార్హం. అందుతున్న సమాచారం ప్రకారం బాంబు బెదిరింపులు వచ్చిన ఇండిగో విమానాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి!

ఫ్లైట్ 6ఈ 58 - జెడ్డా టు ముంబై

ఫ్లైట్ 6ఈ 87 - కోజికోడ్ టు దమ్మామ్

ఫ్లైట్ 6ఈ 11 - ఢిల్లీ టు ఇస్తాంబుల్

ఫ్లైట్ 6ఈ 17 - ముంబై టు ఇస్తాంబుల్

ఫ్లైట్ 6ఈ 133 - పూణె టు జోధ్ పూర్

ఫ్లైట్ 6ఈ 112 - గోవా టూ అహ్మదాబాద్

ఇలా గత ఆరు రోజులుగా వరుసగా ప్రతీ రోజూ పలు విమానాలకు ఇలా బెదిరింపులు వస్తుండటంతో విమానయాన సంస్థలతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో... తాజాగా "బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ" (బీసీఏఎస్) అప్రమత్తమైంది. ఈ సమయంలో... విమానయాన సంస్థల సీఈవోలతో సమావేశమైంది.

ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ఇలాంటి అసౌకర్యాలను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం (ఎస్.ఓ.పీ) ను అనుసరించాలని సీఈవోలను కోరినట్లు తెలుస్తోంది.

ఇక, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వస్తోన్న బెదిరింపులను వాటి ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేయగా... అవి లండన్, జర్మనీ, కెనడా, అమెరికా నుంచి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు! మరోపక్క విమానాలను బాంబు పేరుచెప్పి బెదిరించే పనులు చేసే ఆకతాయిలను నో-ఫ్లై లిస్ట్ లో యాడ్ చేయాలని పౌర విమానయాన సంస్థ చూస్తోందని అంటున్నారు.

ఇదే సమయంలో... అలాంటి పనులు చేసేవారికి కఠిన శిక్షలు విధించేలా "బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ" (బీఏసీఎస్)లో పలు మార్పులు తీసుకురావాలని యోచిస్తోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో... నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ విమానాల రూటు మార్చడం వల్ల కంపెనీలు ప్రతి గంటకూ రూ.13 నుంచి 17 లక్షల వరకూ నష్టపోతున్నాయని! ఇక అంతర్జాతీయ విమానల విషయానికొస్తే ఈ నష్టం మరో ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News