ఏదో ఆవేశంలో మాట్లాడేశా? తప్పైపోయింది : జేసీ క్షమాపణలు
ఇటీవల బీజేపీ మహిళా నేత, సినీనటి మాధవీలతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ.. ఆమెకు భేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు.
ఆవేశంలో ఏదేదో మాట్లాడేశా.. నాది తప్పే.. ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబుతున్నానంటూ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇటీవల బీజేపీ మహిళా నేత, సినీనటి మాధవీలతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ.. ఆమెకు భేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు.
తాడిపత్రిలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకులపై బీజేపీ మహిళా నేతలు మాధవీలత, యామినీశర్మ విమర్శలు చేయడం, ఆ విమర్శలపై జేసీ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇటీవల పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో జేసీపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వయసులో పెద్దవారు అనుచితంగా మాట్లాడొచ్చా? అంటూ అంతా ప్రశ్నించారు. దీంతో తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన జేసీ ఆదివారం బహిరంగ ప్రకటన చేశారు.
సినీ నటి మాధవీలతపై తాను కావాలని వ్యాఖ్యలు చేయలేదని, ఏదో ఆవేశంలో మాట్లాడాను తప్ప, ఆమెను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. 72 ఏళ్ల వయసులో అలా మాట్లాడాల్సింది కాదని వ్యాఖ్యానించారు. ఇక తనపై విమర్శలు చేసిన వారంతా ఫ్లెక్సీగాళ్లేనని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఏ ఒక్కరికీ లేదన్నారు. తాడిపత్రి కోసం తాను ఎంతవరకైనా వెళ్తానని జేసీ మరోసారి వ్యాఖ్యానించారు.
న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రిలోని జేసీ పార్కులో మహిళల కోసం ప్రభాకర్ రెడ్డి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వెళ్లొద్దని బీజేపీ నేతలు మాధవీలత, యామినీశర్మ సోషల్ మీడియాలో మహిళలను కోరారు. గంజాయి తాగేవాళ్లుఉంటారని దాడులు చేస్తే ఎవరిది బాధ్యతంటూ వారు ప్రశ్నించారు. బీజేపీ నేతల ప్రకటనలు జేసీకి ఆగ్రహం తెప్పించాయి. తమను గంజాయి గాళ్లతో పోల్చడమేంటంటూ మహిళా కౌన్సిలర్లతో వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేయించారు. మరోవైపు మీడియాతో మాట్లాడిన జేసీ, మాధవీలతను ప్రాస్టిట్యూట్ అనడంతో బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. మంత్రి సత్యకుమార్ ఈ విషయంపై స్పందిస్తూ జేసీ మాటలను తప్పుపట్టారు. జేసీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. దీంతో వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతుందని అంతా భావించారు. ఇలాంటి సమయంలో జేసీ స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా? అనేది చూడాల్సివుంది.