భిక్షగాళ్ల గురించి సమాచారమిస్తే రూ.వెయ్యి.. తర్వాతేమైంది?

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో భిక్షగాళ్లను లేకుండా చేసేందుకు అక్కడి ప్రభుత్వం వినూత్న ప్రకటన చేసింది.

Update: 2025-01-07 04:32 GMT

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో భిక్షగాళ్లను లేకుండా చేసేందుకు అక్కడి ప్రభుత్వం వినూత్న ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. భిక్షాటన చేస్తూ కనిపించిన వారి సమాచారమిస్తే.. రూ. వెయ్యి బహుమతిని ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. ప్రభుత్వాధికారులకు వందల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్న పరిస్థితి. భిక్షాటన గురించి సమాచారం ఇస్తే రూ.వెయ్యి బహుమతికి సంబంధించిన ప్రకటనను జనవరి రెండున ప్రకటించగా.. విశేష స్పందన వచ్చినట్లుగా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

నాలుగు రోజుల వ్యవధిలో వందల కొద్దీ ఫోన్ కాల్స్ వచ్చాయని ఉన్నతాధికారులు ప్రకటించారు. తమకు వచ్చిన ఫోన్ కాల్స్ ను నమోదుచేసిన అధికారులు.. ఆ సమాచారాన్ని తనిఖీ చేస్తున్నట్లుగా కలెక్టర్ వెల్లడించారు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్టు నెలకొంది. భిక్షగాళ్ల నుంచి సమాచారం అందించిన వందల మందిలో కేవలం పన్నెండు మంది మాత్రమే.. సరైన సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.

మిగిలిన వారి సమాచారాన్ని మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇండోర్ నగరానికి యాచకులు లేని నగరంగా మార్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యాచకుల సమాచారాన్ని అందించిన వారికి వెయ్యి రూపాయిల బహుమతి ఇస్తున్నారు. అంతేకాదు.. భిక్షగాళ్లకు డబ్బు ఇచ్చినా.. వారికి ఇతర వస్తువులను ఇచ్చినా.. అలా ఇచ్చిన వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించారు.

నాలుగు నెలల వ్యవధిలో నాలుగు వందల మందికి పునరావాస కేంద్రాలకు పంపారని.. 64 మంది చిన్నారుల్నిపిల్లల సంరక్షణ సంస్థకు అప్పగించినట్లుగా అధికారులు ప్రకటించారు. నిజానికి హైదరాబాద్ మహానగరంలోనూ యాచకులు లేని నగరంగా మార్చాలని కొన్నేళ్ల క్రితమే ప్రకటించినా.. ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఇండోర్ అధికారుల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.

Tags:    

Similar News