లవ్ మ్యాటర్ ఇంట్లో చెబుతాడన్న భయంతో సూసైడ్!
హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీనికి కారణం.. ఒక పోకిరి బ్లాక్ మొయిలింగ్ కు తట్టుకోలేక తమను తాము ఆత్మాహుతి చేసుకున్న వైనం గురించి తెలిసినంతనే అయ్యో అనిపించేలా మారింది. వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న ఆందోళన.. ఈ లవ్ మ్యాటర్ వారింట్లో చెబుతానంటూ ఒక పోకిరీ బ్లాక్ మొయిల్ చేయటంతో.. ఒత్తిడి తట్టుకోలేని వారిద్దరు కారులో ఆత్మాహుతికి పాల్పడ్డారు.
యాదాద్రి భువనగిరి పోచంపల్లి మండలానికి చెందిన ఆంజనేయులు కుటుంబం ఇరవై ఏళ్ల క్రితం జమిలాపేటకు వచ్చి ఉంటోంది. ఆయన కుమారుడు పాతికేళ్ల శ్రీరాములు. ఇతడికి ఘట్ కేసర్ మండలం నారపల్లిలో హోల్ సేల్ సైకిల్ షాపు ఉంది. అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికతో అతను ప్రేమలో ఉన్నారు. ఇద్దరికి వేర్వేరుకులాలు. వీరి ప్రేమ వ్యవహారం బాలిక కుటుంబ సభ్యులకు తెలియటంతో పలుమార్లు మందలించి ఆమెపై చేయి చేసుకున్నారు.
ఈ గొడవల నేపథ్యంలో ప్రేమ జంట అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో బాలిక సమీప బంధువు చింటూ.. వీరి ప్రేమ గురించి తెలుసుకొని బ్లాక్ మొయిల్ చేయటం మొదలు పెట్టాడు. తనకు డబ్బులు ఇవ్వాలని.. లేకపోతే పేరెంట్స్ కు చెబుతానని బెదిరించటంతో పలు దఫాల్లో రూ.1.35 లక్షలు ఇచ్చారు. మరింత డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేయటం.. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోరన్న ఆందోళనతో ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.
మేడిపల్లిలోని ఒక సెల్ఫ్ డ్రైవ్ సంస్థ నుంచి కారును అద్దెకు తీసుకున్నశ్రీరాములు.. తాము అనుకున్నట్లుగా ఒక ప్రదేశానికి వచ్చి అక్కడి నుంచి ఇద్దరు కారులో ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో కారును ఆపారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకొని ఒంటికి నిప్పు అంటించుకున్నారు. కారులో మంటలు భరించలేని శ్రీరాములు బయటకు వచ్చి గట్టిగా హాహాకారాలు చేస్తూ మరణించాడు. బాలిక కారులోనే చిక్కుకుపోవటంతో శరీరం మొత్తం గుర్తు పట్టలేనంతగా కాలిపోయింది. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల వేళలో ఈ ఘటన జరగ్గా.. కొందరు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
సెల్ఫ్ డ్రైవ్ సంస్థకు చెందిన ప్రతినిధులు ఘటనాస్థలానికి చేరుకొని సెల్ ఫోన్ నంబరు ఆధారంగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొద్ది రోజుల క్రితం తన కొడుకు ప్రేమ గురించి చెప్పాడని.. ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు తమకు ఆత్మహత్య లేఖను పంపినట్లుగా శ్రీరాముల తండ్రి పోలీసులకు వెల్లడించారు. మరోవైపు ఈ విషయం గురించి తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు చింటూ ఇంటి మీదకు దాడికి దిగారు. చింటూ దొరకపోవటంతో.. అతడి తండ్రిని కొట్టారు. ఈ విషాదం గురించి తెలిసిన వారంతా వేదన చెందుతున్నారు. కాస్త గట్టిగా నిలిస్తే.. ప్రాణాలు పోయేవి కావు కదా? అన్న మాట వినిపిస్తోంది.