కృష్ణమ్మ ఉగ్రరూపం... చంద్రబాబు నివాసానికి వరద ముప్పు!!

ఏపీలో కుండపోత వర్షాలు ప్రజలను వణికించేస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమైపోయాయి.

Update: 2024-09-01 06:48 GMT

ఏపీలో కుండపోత వర్షాలు ప్రజలను వణికించేస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమైపోయాయి. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరంలో రోడ్లు చెరువులను తలపించాయి. నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. ఈ సమయంలో మరికొన్ని గంటల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

దీంతో... లోతట్టుప్రాంతల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. మరోపక్క పలు రైళ్లు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసానికి వరద ముప్పు పొంచి ఉందని అంటున్నారు.

అవును... బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ప్రధానంగా విజయవాడలో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా నగరం మొత్తం వరద నీటితో నిండిపోయింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి.

ఎడతెరిపి లేకుండా కురిసిని భారీ వర్షాల కారణంగా... కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో.. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద 70 గేట్లు ఎత్తడంతో అవుట్ ఫ్లో 6 లక్షల ఐదువేల క్యూసెక్కులుగా ఉండగా.. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులు దాటితే కరకట్టవైపు నీళ్లు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

అదే జరిగితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. కృష్ణానది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో వరద నీరు ఇంట్లోకి చెరే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో.. అధికారులు అప్రమత్తమయ్యారని అంటున్నారు. మరోపక్క ప్రకాశం బ్యారేజ్ కు అనూహ్యంగా వరద నీరు గంట గంటకూ పెరుగుతోందని చెబుతున్నారు.

తీరం దాటిన వాయుగుండం!:

ఏపీని వణికించిన బంగాళాఖాతంలోని వాయుగుండం తీరం దాటింది. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఆదివారం కూడ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News