భారత్ లో విదేశీ పెట్టుబడి‘‘దారులు వేరయ్యాయా?’’

కొన్నేళ్లలో ప్రపంచ మార్కెట్లు ఎలా ఉన్నా భారత్ మార్కెట్ మాత్రం నిలకడగా నిలిచింది.

Update: 2024-05-10 01:30 GMT

కొన్నేళ్లలో ప్రపంచ మార్కెట్లు ఎలా ఉన్నా భారత్ మార్కెట్ మాత్రం నిలకడగా నిలిచింది. లక్షల కోట్ల సంపద ఆవిరి అనే కథనాలు పెద్దగా వినిపించలేదు. అయితే, భారత మార్కెట్లో కీలకమైన విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది భారీ షేర్లు అమ్మేస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. కాగా, వరుసగా రెండు నెలలపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా నిధులు చొప్పించిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) ఏప్రిల్‌ నెలలో మాత్రం రూ.8,700 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. అమెరికా బాండ్‌ ఈల్డ్‌ రేట్లు భారీగా పెరగడమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు.

మార్చి నెలలో నికరంగా రూ.35 వేల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌ఐఐలు.. ఏప్రిల్ లో మాత్రం భారీగా వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్లోకి రూ.2,222 కోట్లు, డెబిట్‌ మార్కెట్లలోకి రూ.44,908 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 5.25 శాతం నుంచి 5.50 శాతంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇలా వడ్డీరేట్లు యథాతథంగా ఉండటం ఇది ఆరోసారి.

అమ్మేసిన షేర్లు రూ.49 వేల కోట్లు

భారత మార్కెట్లో ఎలాంటి ఒడిదొడుకులు లేనప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు ఎందుకిలా షేర్లు అమ్మేస్తున్నారు? అనేది చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటివరకు దాదాపు రూ.49 వేల కోట్ల షేర్లను అమ్మేయడమే ఇంత పెద్ద చర్చకు కారణం. కాగా, మార్చి నాటికి హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ నుంచే ఏకంగా 29 కోట్ల షేర్లను వెనక్కు తీసుకోవడం గమనార్హం.

ఇదీ అసలు కారణం..

భారత్ లో బ్యాంకర్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ది డేగ కన్ను. వినియోగదారుల ప్రయోజనాలకు ఏ మాత్రం తేడా వస్తున్నట్లు తెలిసినా సహించదు. ఇటీవల కొటక్ మహీంద్రా బ్యాంక్, నాలుగేళ్ల కిందట హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులకు భారీగా జరిమానా వేసింది. ఇలా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్ బీఎఫ్ సీ)లు, బ్యాంకులు, ఫిన్ టెక్ సంస్థలపై నిబంధనల ఉల్లంఘనలకు గాను ఆర్బీఐ కొరడా ఝళిపిస్తూనే ఉంది. బహుశా ఈ నేపథ్యంలోనే విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొని వేరే దారి చూసుకుంటున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News