పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఎంపీ ?

ఆనాడు త్రిముఖ పోరులో నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఎంవీవీ సత్యనారాయణ గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.

Update: 2024-10-12 16:49 GMT

ఆ మాజీ ఎంపీ పొలిటికల్ లైఫ్ స్పాన్ తక్కువే. అయితే లక్కుని తొక్కిన ఆయన తక్కువ టైంలోనే ఎంపీగా అయ్యారు. విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన లోక్ సభ సీటు నుంచి అయిదేళ్ల పాటు ఎంపీగా పనిచేశారు. 2019లో ఆయన వైసీపీ తరఫున గెలిచారు. ఆనాడు త్రిముఖ పోరులో నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఎంవీవీ సత్యనారాయణ గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.

అయితే అయిదేళ్ళ ఎంపీగా ప్రస్థానంలో ఆయన జనాలకు చేరువ కాలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. అంతే కాదు పార్టీలో జనాలకు కూడా ఆయన దూరం అయ్యారు. ఇక ఆయనకు విజయసాయిరెడ్డికి మధ్య విభేదాలు రావడంతో అప్పట్లో అధికార పార్టీలో అదొక రచ్చగా సాగింది. వీటి తరువాత ఆయన తాను హైదరాబాద్ కి వెళ్ళి బిజినెస్ చేసుకుంటాను అని ఓపెన్ గా మీడియా ముందు ప్రకటించి వైసీపీని షాక్ తినిపించారు.

సీన్ కట్ చేస్తే అధినాయకత్వం ఆయంతో మాట్లాడి అంతా ఓకే చేసింది. ఆ తరువాత ఆయన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం కూడా కలకలం రేపింది. దీని మీద కూడా విమర్శలు వచ్చాయి. అధికార ఎంపీ కుటుంబానికే భద్రత లేదు అని విపక్షాలు మండిపడ్డాయి.

మరో వైపు ఎంవీవీ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టడంతో వాటి మీద కూడా విపక్షాలు టార్గెట్ చేశాయి. ఆయన అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించాయి. వీటి నేపధ్యంలో ఆయన కొంత కలత చెందినా వైసీపీ హై కమాండ్ మాత్రం ఆయనకు ఉన్న అంగబలం అర్ధబలం వంటివి చూసి విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీకి నిలిపింది. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయ ఢంకా మోగించింది. ఎంవీవీ భారీ తేడాతోనే ఓటమి పాలు అయ్యారు.

ఆ తరువాత నుంచి ఆయన వైసీపీ యాక్టివిటీస్ కి దూరం అవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వైసీపీలో ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ కూడా నడచింది. అయితే ఇటీవల జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే ఈ మాజీ ఎంపీ పొలిటికల్ రిటైర్మెంట్ ని ప్రకటించారని అంటున్నారు.

ఆయన ఇదే విషయం అధినాయకత్వానికి కూడా చెప్పారని అంటునారు. తన మనస్తత్వం ప్రస్తుత రాజకీయానికి సరిపడదని అందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఆయన ఈ రకంగా డెసిషన్ తీసుకున్నాక అధినాయకత్వం కూడా వేరే అలోచనలు చేస్తోంది అని అంటున్నారు.

విశాఖ తూర్పు నియోజకవర్గం ఇపుడు ఇంచార్జి లేకుండా ఖాళీగా ఉంది. అక్కడ వైసీపీకి సంబంధించి ఏ రకమైన యాక్టివిటీ జరగడంలేదు. దాంతో తొందరలోనే అక్కడ కొత్త వారిని తీసుకుని వచ్చి నియమిస్తారు అని అంటున్నారు

ఇవన్నీ పక్కన పెడితే సినీ నిర్మాతగా బిల్డర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఎంవీవీ రాజకీయంగా మాత్రం సక్సెస్ కాలేకపోయారా అన్న చర్చ నడుస్తోంది. ఆయన ఎందుకు ఈ విధంగా పొలిటికల్ రిటైర్మెంట్ డెసిషన్ తీసుకున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. అయితే 2029 ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయని ఈ లోగా అనేక పరిణామాలు మారుతాయని అంటున్నారు.

టీడీపీ కూటమి ఎంవీవీని టార్గెట్ చేసిందని అందుకే ఆయన రాజకీయ విరమణ ప్రకటించారని కూడా అంటున్నారు. వైసీపీకి దూరంగా ఉండడం ద్వారా ఆయన కూటమి టార్గెట్ నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందవచ్చు అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక అన్నీ సర్దుకున్న మీదట 2029 ఎన్నికల వేళకు ఆయన మళ్లీ రాజకీయాలలో రీ ఎంట్రీ ఇవ్వవచ్చు అని అంటున్నారు. నిజంగా అలా జరుగుతుందా ఆయన మళ్ళీ పాలిటిక్స్ లోకి అడుగు పెడతారా అన్నది పక్కన పెడితే ఆయన వన్ టైం ఎంపీగా షార్ట్ టైం పాలిటిక్స్ లో ఉన్న నేతగా మాత్రం ఉండిపోయారు అని అంటున్నారు.

Tags:    

Similar News