బయటపడ్డ విద్రోహ చర్య.. తప్పిన భారీ ప్రమాదం

ఈ మధ్య రైలు ప్రమాదాలు భయానికి గురిచేస్తున్నాయి. ఏటా రైలు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతుండడంతో రైలు ప్రయాణం చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

Update: 2024-09-22 10:28 GMT

ఈ మధ్య రైలు ప్రమాదాలు భయానికి గురిచేస్తున్నాయి. ఏటా రైలు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతుండడంతో రైలు ప్రయాణం చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కారణాలు ఏవైనా నెలకో ప్రమాదాన్ని మాత్రం చూస్తునే ఉన్నాం. అదృష్టవశాత్తూ భారీ ప్రాణనష్టం జరగకున్నా.. రైల్వే శాఖకు మాత్రం పెద్ద ఎత్తున నష్టం వస్తోంది.

కొన్ని రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాల బారిన పడుతుంటే.. మరికొన్ని రైళ్లు కొందరి ఆకతాయిల పనులతో యాక్సిడెంట్లకు గురవుతున్నాయని తెలుస్తోంది. గతంలో విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్, కాంచన్‌జుంగ, హౌరా- ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, వారణాశి జంక్షన్-అహ్మదాబాద్ సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదాలకు గురయ్యాయి. తాజాగా ఓ కుట్రకోణం బయటపడింది. రైలును ప్రమాదంలో పడేందుకు చేసిన కుట్ర వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను పసిగట్టిన పైలెట్ వెంటనే రైలును నిలిపివేశాడు. ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం వల్ల సిలిండర్‌కు అత్యంత సమీపం వరకు వచ్చి రైలు ఆగిపోయింది. ఒకవేళ పైలెట్ అప్రమత్తంగా లేకుంటే ఆ గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పేది కాదు.

కాన్పూర్-ప్రయాగ్ రాజ్ మార్గంలో ఈ గూడ్స్ నడుస్తోంది. ప్రేమ్‌పూర్ స్టేషన్ సమీపంలోకి రాగానే పట్టాలపై గ్యాస్ సిలిండర్ కనిపించింది. సమాచారం తెలుసుకున్న రైల్వే భద్రతా సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే సిలిండర్‌ను పట్టాలపై వదిలినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.

Tags:    

Similar News