70 గంటలు పని చేస్తే పెళ్లాం పారిపోతుంది!- గౌతమ్ అదానీ
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ డిబేట్‌పై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ డిబేట్‌పై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకరు తమకు నచ్చిన పనులను చేసినప్పుడు సమతుల్యత సాధ్యమని, అలా కాకుండా గంటల తరబడి ఆఫీసుల్లోనే ఉండిపోతే పెళ్లాం పారిపోతుందని అదానీ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వేగంగా యువతరంలోకి దూసుకెళ్లాయి. ప్రతి ఒక్కరూ చివరికి వెళ్లిపోవాల్సిందేనని తెలిసాక.. జీవితం సరళంగా మారుతుందని కూడా ఆయన వేదాంతం వల్లించారు.
ఐఏఎన్ఎస్ తో మాట్లాడిన అదానీ ... ఒకరి ఆలోచనలను ఇతరులపై రుద్దకూడదని కూడా సూచించారు. చేసే పనిని, వ్యక్తిగత జీవితాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా బ్యాలెన్స్ చేసుకుంటారని అన్నారు. ఎవరైనా కుటుంబంతో నాలుగు గంటలు గడిపి ఆనందాన్ని పొందొచ్చు..లేదా ఎనిమిది గంటలు గడిపి ఆనందిస్తే అది వారి బ్యాలెన్సింగ్ ప్లాన్. కానీ వారానికి 70 గంటలు పనిలోనే గడిపినట్లయితే, బీవీ భాగ్ జాయేగీ (భార్య పారిపోతుంది) అని వ్యాఖ్యానించారు.
తమకు నచ్చిన వారి ఆనందంలోనే తమ ఆనందం ఉంటుందని కూడా అదానీ వ్యాఖ్యానించారు. మీకు నచ్చిన పనులు చేస్తే మీ ఉద్యోగం-జీవితం సమతుల్యంగా ఉంటుంది.. మాకు కుటుంబం లేదా పని.. దీని కంటే వేరే ప్రపంచం లేదు. మా పిల్లలు కూడా దానిని మాత్రమే గమనిస్తారని అన్నారు. ఎవరూ శాశ్వతంగా ఇక్కడకు రారు. దీనిని అర్థం చేసుకుంటే జీవితం సాదాసీదాగా మారుతుంది అని గౌతమ్ అదానీ వ్యాఖ్యానించారు.
భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడేందుకు వీలుగా నేటితరం వారానికి 70 గంటల పని కోసం ముందుకు రావాలని గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై చాలా విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు గౌతమ్ అదానీ కూడా విమర్శించిన వారి జాబితాలో చేరారు.
800 మిలియన్ల భారతీయులు 800 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు. మనం కష్టపడి పని చేసే స్థితిలో లేకుంటే ఎవరు కష్టపడతారు? అందుకే వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. కానీ గౌతమ్ అదానీ దానిని సింపుల్ గా కొట్టి పారేసారు. వర్క్ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ తో బ్యాలెన్స్ చేయకపోతే ఆనందం దక్కదని అన్నారు.