స్టార్ హీరోయిన్ స్థలాన్ని కొట్టేసి అమ్ముకున్నారు!
తన స్థలం కబ్జాపై రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ గౌతమి ఫిర్యాదు చేశారు.
ఒకప్పటి అందాల తార.. గౌతమి మీకు తెలిసే ఉంటుంది. తెలుగులో వెంకటేశ్ సరసన శ్రీనివాస కళ్యాణం, రాజేంద్రప్రసాద్ సరసన గాంధీనగర్ రెండో వీధి, బామ్మ మాట బంగారు బాట తదితర చిత్రాల్లో నటించింది. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న గౌతమి గతేడాది సెప్టెంబరులో కొందరు తన స్థలం కబ్జా చేశారని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన రూ.25 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని ఆమె ఆరోపించింది. అదేంటని ప్రశ్నించినందుకు తనను, తన కూతురిని చంపుతామని బెదిరిస్తున్నారంటూ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. గౌతమికి చెన్నై సమీపంలోని శ్రీపెరుంబూర్ సహా తమిళనాడులోని రామనాథపురం జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో రూ.46 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలుస్తోంది. తన అనారోగ్యం కారణంగా కొన్ని ఆస్తులను ఆమె అమ్మేయాలనుకుంది. ఈ పనిని అలగప్పన్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కు అప్పగించింది. అయితే ఈ ఆస్తిపై అలగప్పన్ కన్నేశాడు. ఆ ఆస్తికి నకిలీ పత్రాలు సృష్టించాడు. అలాగే ఫోర్జరీ సంతకాలతో దాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో రూ.3 కోట్ల విలువైన గౌతమి ఆస్తిని ఆమెకు తెలియకుండా అమ్మేసుకున్నాడు.
జరిగిన మోసం తెలుసుకున్న గౌతమి దీనిపై ప్రశ్నించగా ఆమెను, ఆమె కుమార్తెను చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో గౌతమి చెన్నైలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అప్పట్లో ఫిర్యాదు చేసింది.
తనకు రాజకీయ అండ ఉందని.. తనను, తన కుమార్తెను చంపుతానని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో గౌతమి పేర్కొంది. ఈ సమస్యల వల్ల తన కూతురి చదువుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తన ఫిర్యాదులో వెల్లడించింది. తన స్థలాన్ని తిరిగి తనకు అప్పజెప్పాలని విన్నవించింది. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న అళగప్పన్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. గౌతమి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తన స్థలం కబ్జాపై రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ గౌతమి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సి.అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్, కారు డ్రైవర్ సతీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు ఏడాది నుంచి కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారు మళ్లీ బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, వారికి బెయిల్ ఇవ్వకూడదని గౌతమి తరఫున హాజరైన న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా తెలుగమ్మాయి అయిన గౌతమి దక్షిణ భారతంలోని అన్ని భాషా చిత్రాల్లో నటించారు. బెంగళూరులో చదువుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో సెటిల్ అయ్యారు. 1998లో సందీప్ బాటియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న గౌతమికి 1999లో సుబ్బలక్ష్మి అనే కుమార్తె జన్మించింది. అదే ఏడాది తన భర్తతో గౌతమి విడిపోయింది.
ఆ తర్వాత 2003లో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తో గౌతమి సహజీవనం ప్రారంభించారు. దాదాపు 13 ఏళ్లపాటు గౌతమి సహజీవనం చేశారు. 2016లో కమల్ తో విడిపోతున్నట్టు ఆమె బహిరంగ ప్రకటన చేశారు.
గతంలో ఎలేకే అద్వానీ సమక్షంలో బీజేపీలో చేరిన గౌతమి 1999 ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.