నరమేధానికి నెల రోజులు.. 11 వేలు దాటిన మృతులు!
వాస్తవానికి గాజాలోని హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7 తెల్లవారుజామున ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం కురిపించి బీభత్సం సృష్టించారు
సరిగ్గా నెలరోజుల క్రితం అక్టోబర్ 7 శనివారం తెల్లవారుజామున ఇజ్రాయేల్ పైకి వేలాది రాకెట్లు దూసుకువచ్చాయి. హమాస్ ఉగ్రవాదులు కేవలం 20 నిమిషాల వ్యవధిలో సుమారు 5000 రాకెట్లు ప్రయోగించారు. అనంతరం ఇజ్రాయేల్ హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై ప్రతిదాడులు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసి అల్లల్లాడించేస్తుంది! ఈ నరమేదం ప్రారంభమై (నవంబర్ 7 నాటికి) నెలరోజులు పూర్తవుతుంది.
అవును... ఇజ్రాయేల్ పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులకు నెలరోజులు పూర్తవుతుంది. అమాయకపు ప్రజలపై విచక్షణారహితంగా హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులకు ఇజ్రాయేల్ సైన్యం రివేంజ్ బలంగా తీర్చుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ సుమారు 12 వేలకుపైగా హమాస్ మిలిటెంట్ల అనుమానిత స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ క్రమంలో గాజాలోనే మృతుల సంఖ్య 10 వేలు దాటిందని తెలుస్తుంది.
వాస్తవానికి గాజాలోని హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7 తెల్లవారుజామున ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం కురిపించి బీభత్సం సృష్టించారు. ఒక మ్యూజిక్ ఫెస్టివల్ పై దాడి చేసి వందల మంది ప్రజలను ఊచకోతకోశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ వద్ద దారికాసి మరీ దారుణాలకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో సుమారు 1400 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 250 మందికిపైగా ప్రజలను బందీలుగా చేసుకున్నారు.
ఈ సమయంలో ఇజ్రాయేల్ సైన్యం గాజాపై దండయాత్ర మొదలుపెట్టింది. ఈ దాడుల్లో దాదాపు 10,022 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 25 వేల మంది గాయాలపాలయ్యారని, వేల మంది ఆచూకీ లేకుండా పోయింది. వేల భవనాలు నేలమట్టం అయ్యాయని, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని చెబుతుంది.
ఇక గాజాపై దాడులు చేయాలని నిర్ణయించుకున్న అనంతరం ఆ ప్రాంత సరిహద్దులను ఇజ్రాయెల్ దళాలు దిగ్బంధం చేసేశాయి. ఇలా అష్టదిగ్భందనం చేసేయడంతో ఆహారం, ఇంధనం, విద్యుత్, మంచినీటి సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ఎమర్జెన్సీ అయిన ఆసుపత్రుల్లో కూడా ఇందనం లేక జనరేటర్లు నిలిచిపోతున్నాయి. దీంతో సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తుంది.
మరోపక్క గాజాలో దాదాపు 50వేల మంది గర్భిణులు సైతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. తాజా పరిస్థితులతో వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయేల్ మాత్రం... "ది సూపర్ నోవా" పేరిట ఏర్పాటు చేసిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్ పై దాడిచేసిన హమాస్ ఉగ్రవాదులు జరిపిన ఘోరాలను మరిచిపోలేకపోతుంది. దీనిపై ఆ దేశప్రజలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లుంది!
ఈ సమయంలో కొన్ని దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్నాయి. హమాస్ కూడా యుద్ధం ఆపేసి బందీలను ఎక్స్ చేంజ్ చేసుకోవడానికి సిద్ధం అంటూ సన్నాయినొక్కులు నొక్కుతుంది. మరోపక్క ఐరాస కూడా అందోళన వ్యక్తం చేస్తుంది. ఎవరు ఏమి చెప్పినా, ఎన్ని చెప్పినా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం కాల్పుల విరమణకు ససేమిరా అంటున్నారు. తగ్గేదే లే అనే సంకేతాలు పంపుతున్నారు. మొత్తంగా హమాస్ మొదలుపెట్టిన ఈ నరమేధంలో ఇప్పటివరకూ 11వేలమంది మృతిచెందారని తెలుస్తుంది.