మీ ఆర్టిఫీషియల్ వేషాలు చెల్లవ్.. ‘గూగుల్’కు కేంద్రం ఝలక్
ఆ సమాధానం వివాదం సృష్టించిన కొన్ని రోజుల తర్వాత.. ప్రభుత్వం సామాజిక మాధ్యమ, ఇతర ప్లాట్ ఫామ్స్ కు అడ్వైజరీ జారీ చేసింది
ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం.. సోషల్ మీడియా కాలం.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. వాటిలో రకరకాల యాప్స్.. దీనికితోడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ).. మనిషి మేధను అంచనా వేస్తూ.. దానిని మించి సమాధానం ఇస్తూ ఏఐ చేస్తున్న పని అంతాఇంతా కాదు.. ఇది సరైన దారిలో వెళ్తే ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ, కొన్నిసార్లు అదుపు తప్పుతుండడమే వివాదాస్పదం అవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇటీవల ప్రధాని మోదీపై ఎవరో అడిగిన ప్రశ్నలకు గూగుల్ ఏఐ ప్లాట్ ఫామ్ ఇచ్చిన సమాధానాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఆ సమాధానం వివాదం సృష్టించిన కొన్ని రోజుల తర్వాత.. ప్రభుత్వం సామాజిక మాధ్యమ, ఇతర ప్లాట్ ఫామ్స్ కు అడ్వైజరీ జారీ చేసింది.
గూగుల్ ను ఉద్దేశించే..
మోదీ గురించి అడిగిన ప్రశ్నకు గూగుల్ జెమిని ఏఐ ప్లాట్ ఫామ్ ప్రతిస్పందించిన తీరు భారత ఐటీ చట్టాలను ఉల్లంఘించడమేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అయితే, తన ప్లాట్ ఫామ్ ఇంకా పరీక్ష (ట్రయల్) దశలోనే ఉందని గూగుల్ అంటున్నా, విచారణ నుంచి మాత్రం తప్పించుకోలేదని తేల్చి చెప్పారు. తొలుత తప్పు చేసి తర్వాత క్షమాపణలు చెప్పి బాధ్యతల నుంచి ఏ ప్లాట్ ఫామ్ కూడా తప్పించుకోలేదన్నారు. వాస్తవానికి ఇటీవల గూగుల్ తీసుకున్న ఓ నిర్ణయం నేపథ్యంలో.. ప్రభుత్వం ఇలాంటి చర్యకు దిగిందని అనిపిస్తోంది. భారత స్టార్టప్ లు కొన్నిటితో గూగుల్ కు సర్వీసు రుసుము చెల్లింపు వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. దీనిపై స్టార్టప్ రంగంలో ఆందోళన నెలకొంది. ఒక్క రోజు వ్యవధిలోనే కేంద్రం రంగంలోకి దిగింది. భారత స్టార్టప్ లు ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనవని.. వాటిని ఏ సాంకేతిక దిగ్గజం (గూగుల్ ను ఉద్దేశించి) దయాదాక్షిణ్యాలకు వదిలివేయలేని కుండబద్దలు కొట్టింది. ఆ దెబ్బకు గూగుల్ దిగొచ్చి.. ప్లేస్టోర్ నుంచి తొలగించి భారత యాప్ లను పునరుద్ధరించింది. ఇప్పుడు కేంద్రం తాజాగా గూగుల్ కు మరో యాంగిల్ లో ఝలక్ ఇచ్చింది.
ఇంతకూ ఏం జరిగింది?
జెమినీ ఏఐ టూల్.. అత్యంత కచ్చితత్వంతో పనిచేస్తుందని గూగుల్ వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ వర్షన్ ఏఐ టూల్ అని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే.. మోదీ ఫాసిస్టా? (మత వాదా?) అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు జెమిని ఏఐ ఏం చెప్పిందంటే.. ‘‘ఇదే ప్రశ్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి అడిగితే కచ్చితంగా, స్పష్టంగా సమాధానం చెప్పలేం’’ అని పేర్కొంది. పరోక్షంగా మోదీని నిందించినట్లే ఉంది ఈ సమాధానం. దీంతో కేంద్రం మండిపడింది. ఈ వివాదం తలెత్తిన కొన్ని రోజుల తర్వాత.. ప్రభుత్వం సామాజిక మాధ్యమ, ఇతర ప్లాట్ ఫామ్‌లకు అడ్వైజరీ జారీ చేసింది. పరీక్ష దశలో ఉన్న ఏఐ నమూనాలను లేబుల్ చేయడానికి, చట్ట విరుద్ధమైన కంటెంట్ ను హోస్ట్ చేయడాన్ని నిరోధించడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. మార్చి 1న
ఇంటర్మీడియరీలు/ప్లాట్ ఫామ్ లకు ఈ అడ్వైజరీ జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ సూచించిన నిబంధనలు పాటించకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ఇంటర్మీడియరీలు లేదా ప్లాట్ ఫామ్‌లు కృత్రిమ మేధ (ఏఐ) నమూనాలు/ఎల్‌ఎల్‌ఎం/జనరేటివ్ ఏఐ, సాఫ్ట్ వేర్లు లేదా అల్గారిథమ్ లను వాటి కంప్యూటర్ రిసోర్స్‌లో లేదా దాన్ని ఉపయోగించడం ద్వారా వినియోగదార్లను హోస్ట్ చేయడానికి, అప్ లోడ్ చేయడానికి, సవరించడానికి, ప్రదర్శించడానికి అనుమతించకూడదని పేర్కొంది. ఉల్లంఘనలకు అన్ని ప్లాట్ ఫామ్ లు, ఇంటర్మీడియరీలదే బాధ్యత అని తెలిపింది.