ఈసారి జర్మనీ వంతు.. ఎయిర్ పోర్టులోకి దూసుకెళ్లి మరీ కాల్పులు
కారణం ఏమైనా కానీ అగ్రరాజ్యంతో పాటు.. సంపన్న దేశాల ప్రయోజనాల కోసం వేసిన ఎత్తులు.. నెమ్మదిగా వారి కొంప ముంచుతున్నాయి.
కారణం ఏమైనా కానీ అగ్రరాజ్యంతో పాటు.. సంపన్న దేశాల ప్రయోజనాల కోసం వేసిన ఎత్తులు.. నెమ్మదిగా వారి కొంప ముంచుతున్నాయి. ఐదారేళ్ల క్రితం వరకు కూడా ప్రపంచంలో అత్యంత సురక్షితమైన.. ప్రశాంతమైన దేశాల జాబితాను చూస్తే.. యూరోపియన్ దేశాలు ప్రముఖంగా ఉండేవి.కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆసియా ఖండంలోని వివిధ దేశాల మీద సంపన్న దేశాల ఎత్తులు ఇప్పుడు వారికి కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడా జాబితాలోకి జర్మనీ కూడా చేరనుందా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం ప్రపంచం ఒక్కసారిగా ఆ దేశం వైపు చూసే పరిస్థితి.
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలోకి ఒక దుండగుడు కారులో దూసుకెళ్లటమే కాదు.. కాల్పులు జరిపిన వైనం షాకింగ్ గా మారింది. మానసికంగా సరిగా లేని వ్యక్తి ఈ పని చేశాడా? లేదంటూ.. వ్యూహంలో భాగంగా ఏదైనా సంస్థ ఇలాంటి పని చేయించిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. భద్రతాసిబ్బందిని దాటుకొని.. కారులో వేగంగా ఎయిర్ పోర్టులోకి దూసుకొచ్చి.. గాల్లోకి రెండు కాల్పులు జరిపిన వైనం విస్మయానికి గురి చేస్తోంది. దీంతో.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది ప్రయాణికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ఉదంతంపై లోతైన విచారణ షురూ అయినట్లుగా చెబుతున్నారు.
ఎయిర్ పోర్టు రన్ వే మీద కారును ఉంచిన దుండగుడ్ని సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ వివాదంలో భాగంగా సదరు ఆగంతుకుడు ఇలా ప్రవర్తించినట్లుగా చెబుతున్నారు. దీంతో.. హాంబర్గ్ ఎయిర్ పోర్టులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టులోని బ్యారికేడ్లను ఢీకొంటూ తన కారులో వేగంగా దూసుకెళ్లాడు 35 ఏళ్ల వ్యక్తి. తన కారును ఒక విమానం కింద అడ్డంగా పార్కు చేసినట్లుగా చెబుతున్నారు.
ఆ వెంటనే.. విమానంలో ఉన్న ప్రయాణికుల్ని గ్యాంగ్ వే మార్గంలో సురక్షితంగా బయటకు తరలించారు.కారులో ఉన్న వ్యక్తితోపాటు.. నాలుగేళ్ల చిన్నారి కూడా అతడితోనే ఉన్నట్లు చెబుతున్నారు. చిన్నారి ఆ అగంతకుడి కుమార్తెగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యక్తి భార్యగా చెప్పుకుంటున్న మహిళ.. తన కుమార్తె కనిపించటం లేదంటూ హాంబర్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజా పరిణామంతో ఎయిర్ పోర్టు మొత్తాన్ని మూసేసిన అధికారులు.. పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. దీంతో 27 విమాన సర్వీసుల మీద ప్రభావం పడుతోంది. రెండుసార్లు కాల్పులు జరపటం.. కొన్ని సీసాలకు నిప్పు అంటించి.. బయటకు విసరటం లాంటి చర్యలకు పాల్పడిన నేపథ్యంలో.. ఎయిర్ పోర్టులోకి ప్రత్యేక దళాల్ని తరలించారు. అదే సమయంలో మానసిక నిపుణులను రంగంలోకి దించి.. ఆ వ్యక్తిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు.