వైసీపీ ఎమ్మెల్యేకు గోల్డెన్ చాన్స్...!

వైసీపీ ఎమ్మెల్యే విశాఖ జిల్లా పాయకరావుపేట కు చెందిన గొల్ల బాబూరావుకు జగన్ గొల్డెన్ చాన్స్ ఇచ్చేశారు

Update: 2023-12-28 11:00 GMT

వైసీపీ ఎమ్మెల్యే విశాఖ జిల్లా పాయకరావుపేట కు చెందిన గొల్ల బాబూరావుకు జగన్ గొల్డెన్ చాన్స్ ఇచ్చేశారు. హాయిగా ఆరేళ్ల పాటు ఉండే రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నట్లుగా హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకున్న వైఎస్ జగన్ వారితో ఇంచార్జిల మార్పు విషయం చర్చించారు.

ఇదిలా ఉంటే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పాయకరావుపేటకు చెందిన గొల్ల బాబూరావుకు ప్రమోషన్ ఇచ్చే విషయం కూడా చెప్పేశారు అని అంటున్నారు. ఆయనను వచ్చే మార్చిలో ఏపీ నుంచి ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ సీట్లలో ఒక దాన్ని ఇచ్చి గౌరవిస్తామని జగన్ భరోసా ఇచ్చారని అంటున్నారు.

దాంతో గొల్ల బాబూరావు వర్గీయులలో ఆనందం వ్యక్తం అవుతోంది. పెద్దల సభలో ఎంపీగా ఉండడం అంట్రే గ్రేటెస్ట్ అచీవ్ మెంట్ అని అంటున్నారు. విశాఖ జిల్లా నుంచి ఇంతవరకూ ఎవరికీ వైసీపీ టీడీపీ హయాంలలో రాజ్యసభ సభ్యత్వం దక్కలేదు. తెలుగుదేశం అనేక సార్లు రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసినా విశాఖకు చాన్స్ అయితే ఇవ్వలేదు.

ఇక కాంగ్రెస్ మాత్రం ద్రోణం రాజు సత్యనారాయణకు రెండు దఫాలుగా అవకాశం ఇచ్చింది. మరో వైపు చూస్తే గొల్ల బాబూరావు 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన విశాఖ జిల్లా పరిషత్ లో సీఈఓగా పనిచేసేవారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత వైఎస్సార్ ది. తాను దగ్గరుండి గెలిపించుకుంటాను అని చెప్పి మరీ వైఎస్సార్ గెలిపించుకున్నారు.

ఆ తరువాత వైఎస్సార్ మరణంతో జగన్ వైపు బాబూరావు వచ్చారు. 2012లో ఆయన ఉప ఎన్నికల్లో రెండవసారి పాయకరావు పేట నుంచి గెలిచారు. ఇక 2014లో ఆయన అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో పాయకరావుపేట నుంచి పోటీలో దించితే గెలిచారు. ఇలా మూడు సార్లు గెలిచిన బాబూరావు పట్ల పార్టీలో కూడా కొంత వ్యతిరేకత ఉంది.

అలాగే జనంలోనూ ఉంది. దాంతో ఈసారి కొత్తవారికి చాన్స్ ఇవ్వాలని హై కమాండ్ చూస్తోంది. చాలా మంది నేతలను వైసీపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత చాన్స్ ఇస్తామని హామీలు ఇస్తోంది. కానీ బాబూరావుకు మాత్రం ముందే అందలం దక్కుతోంది.

ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బాబూరావుకు ఆ ఉన్నతమైన పదవిని అందించడం ద్వారా సామాజిక న్యాయం కూడా తాము చేశామని అందులో తామే చాంపియన్లమని వైసీపీ చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడింది అని అంటున్నారు

ఇదిలా ఉంటే ఈ విధంగా వచ్చే ఏడాది మార్చిలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలు. ఒక స్థానం ఎస్సీకి కేటాయించాలని భావిస్తోన్న అధిష్టానం దృష్టిలో బాబూరావు ఉండడం ఆయన లక్ అని అంటున్నారు. మరి పాయకరావుపేటకు ఎవరు కొత్త ఎమ్మెల్యే అభ్యర్ధి అవుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News