పెద్ద పదవితో సర్దుకున్నారు.. సీటు ఖాళీ.. వైసీపీ సేఫ్!
దీంతో వైసీపీ ఇక్కడ మరోసారి విజయం దక్కించుకునేందుకు బాటలు వేసిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చారా? మేమే ఓడిస్తాం, ఆయనకు ఈ సారి టికెట్ ఇవ్వొద్దు.. ఇంకెవరికి ఇచ్చినా.. ఓకే` -ఇదీ.. గత రెండేళ్లుగా ఆ నియోజకవర్గంలో వినిపించిన భారీ డిమాండ్. పైగా అది ఎస్సీ నియోజకవర్గం. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కిన స్థానం కూడా. అయినప్పటికీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడు.. నోటి దురుసు కారణంగా ఆయన సొంత నేతల ముందే పలుచనయ్యారు. ఏకంగా.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే.. ఓడిస్తామనే పరిస్థితిని తెచ్చుకున్నారు.
ఆయనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు. గతంలో రెండు సార్లు.. తాజాగా 2019లోనూ మొత్తంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న బాబూరావు.. నాలుగోసారి కూడా పోటీ చేసి విజయందక్కించుకుందామనే అనుకున్నారు. కానీ, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పార్టీలో గ్రూపు రాజకీయాలు, వర్గ పోరాటాల మధ్య నలిగిపోతూ వచ్చారు. పాయకరా వుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలన్నింటా ఈయన వ్యతిరేక వర్గాలు బహిరంగంగానే ఆందోళనలు చేస్తున్నాయి.
పార్టీ అధిష్టానం నేరుగా జోక్యం చేసుకున్నా. గొల్ల చుట్టూ ముసిరిన గగ్గోలు ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు.. ఈ వ్యతిరేకత ఇలా ఉంటే.. తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో గొల్ల పార్టీ అధిష్టానంపైనే తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇస్తామన్నా.. తిరస్కరించారు. వెరసి.. ఇటు పార్టీ నేతలకు.. అటు అధిష్టానానికి కూడా కొరగాకుండా పోతున్నారనే వాదన కొన్నాళ్ల కిందట వినిపించింది. అయితే.. గొల్ల ఎస్సీ కావడంతో జగన్‌కు ఆయనను వదులు కోవడం ఇష్టం లేదు.
ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గొల్ల బాబూరావును తప్పిచాలని నిర్ణయించినప్పటికీ.. ఆయన ను రాజ్యసభకు పంపిస్తామని ఇటీవల తాడేపల్లికి పిలిచి మరీ హామీ ఇచ్చారని సమాచారం. దీంతో `పెద్ద`ల సభపై ఆశతో గొల్ల బాబూరావు శాంతించారట. వర్గపోరుతో వేగలేం.. పార్టీ ఏదో ఒక విధంగా పదవి ఇస్తోంది కదా అని సర్దుకుపోతున్నారు. ఇక, గొల్లను తప్పిస్తున్నట్టు వార్తలు రావడంతో పాయకరావుపేట లో నెలకొన్న అలజడి సర్దుమణిగింది.
దీంతో వైసీపీ ఇక్కడ మరోసారి విజయం దక్కించుకునేందుకు బాటలు వేసిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే.. పాయకరావు పేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున వంగలపూడి అనిత పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో ఆమెను ఓడించాలన్న ఉద్దేశంతోనే బలమైన అభ్యర్థి కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించిందని అంటున్నారు పరిశీలకులు.